Begin typing your search above and press return to search.

బీజేపీ పాత్రలో ఇమడలేని రాములమ్మ.. పాతరేయమంటోంది

By:  Tupaki Desk   |   18 Aug 2022 11:15 AM GMT
బీజేపీ పాత్రలో ఇమడలేని రాములమ్మ.. పాతరేయమంటోంది
X
లేడీ అమితాబ్ విజయ శాంతి అంటే అంతే.. రాజకీయంగా ఆమె ఎక్కడా ఇమడలేరు. పాతికేళ్ల కిందటే బీజేపీలో చేరినా.. ఇప్పటికీ పైకెదగలేకపోయారు. తల్లి తెలంగాణ పార్టీ పెట్టినా నిలపలేకపోయారు. టీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ 10వ సోదరిగా పేర్కొన్నా.. అక్కడా కుదురుకోలేకపోయారు. కాంగ్రెస్ లోకి వెళ్లినా అక్కడా నిలవలేకపోయారు. అటు తిరిగి ఇటు తిరిగి చివరకు బీజేపీలోకే వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీని నియంత అని తీవ్రంగా ఆరోపించి.. ఏడాదిన్నరలో మళ్లీ ఆయన పార్టీలోనే చేరారు. ఇక చాన్నాళ్ల తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె 2020లో వచ్చిన మహేశ్ బాబ్ సినిమాలో మెరిశారు. అంతలోనే.. ఇకపై సినిమాలు చేయనంటూ ప్రకటన చేసి ఆశ్చర్యపరిచారు.

బీజేపీలో అంతే... బీజేపీలో అంతే..

రెండేళ్ల కిందటే.. అమిత్ షా సమక్షంలోనే బీజేపీలో చేరిన విజయశాంతికి ఇప్పటికీ సరైన ప్రాధాన్యం లేదు. బీజేపీ అంటే అంతా ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లోనే సాగుతుంది. అందులోనూ ఆ పార్టీలో మొదటినుంచీ ఉన్నవారికే పార్టీ, ప్రభుత్వ పదవులు. దీంతో విజయశాంతికి ఏ పదవీ లేకపోయింది. వాస్తవానికి బీజేపీకి ముందు కాంగ్రెస్ లో ఉండగా ఆమె స్టార్ క్యాంపెయినర్. కానీ, అక్కడి నుంచి వచ్చాక సరైన పాత్ర దొరకలేదు. దీంతో లోలోన రగిలిపోతున్న లేడీ సూపర్ స్టార్ గురువారం హాట్ కామెంట్స్ చేశారు

పాతరేయాలంటూ వ్యాఖ్య

బీజేపీ వంటి క్రమశిక్షణ ఉన్న పార్టీలో అసమ్మతి బయటపడదు. ఒకటీ, అరా ఉన్నప్పటికీ అంతా పార్టీలోనే తొక్కేస్తారు. అందులోనూ నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి వారి హయాంలో అయితే నిరసన గళం ఎత్తే అవకాశమే ఉండదు. అయితే, బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గురువారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల వేదికగా విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి విజయశాంతి ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు. అంటే.. జాతీయ స్థాయి పాత్ర ఉన్న వ్యక్తి. కానీ, రాష్ట్ర పార్టీ నాయకత్వంపై తీవ్రంగా దునుమాడారు. ఆమె వ్యాఖ్యలను బట్టి చూస్త అసంతృప్తి బాగా ఉన్నట్లు తెలుస్తోంది.

గొంతు నొక్కేశారా?

పైకి చెప్పకున్నా.. విజయశాంతి మాటలను బట్టి చూస్తే ఆమెను రాష్ట్ర పార్టీలో అణగదొక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని ఆమో ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియాను కోరారు. తన అసంతృప్తిపై పార్టీ నేతలనే అడగమంటూ మీడియాకు సూచించడం గమనార్హం. ''సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా మాట్లాడదామనుకున్నా. లక్ష్మణ్‌ (ఎంపీ) వచ్చి మాట్లాడి వెళ్లిపోయారు.

నాకేమీ అర్థం కాలేదు. నా సేవలను ఎలా ఉపయోగించు కుంటారో బండి సంజయ్‌, లక్ష్మణ్‌కే తెలియాలి. పార్టీ బాధ్యతలు ఇచ్చినపుడే ఏమైనా చేయగలం. ఇవ్వకుండా చేయమంటే ఏం చేయగలం? నా పాత్ర ఎప్పుడూ టాప్‌ పాత్రే. రాములమ్మ ఎప్పుడూ రాములమ్మ పాత్రే. ఉద్యమకారిణిగా అందరి హృదయాల్లో ఉన్నాను. పార్లమెంట్‌లో కొట్లాడిన మనిషిని. నా పాత్ర ఎప్పుడూ బాగానే ఉంటుంది. పాత్ర లేకుండా చేయాలనుకునే వాళ్లను పాతరేస్తే బెటర్‌గా ఉంటుంది'' అని విజయశాంతి వ్యాఖ్యానించారు.

ఇది తిరుగుబాటే.. లేదా పార్టీని వీడే ఆలోచనా?

విజయశాంతి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఆమెది నిరసన కాదు.. తిరుగుబాటుగా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా గూడుకట్టుకున్న అసంతృప్తిని వెళ్లగక్కిన తీరు తెలుస్తోంది. లేదా ఆమె పార్టీ మారే ఆలోచన చేస్తున్నారా? అన్నది చూడాల్సి ఉంది. వాస్తవానికి తెలంగాణ నుంచి బీజేపీ ఉత్తరప్రదేశ్ కోటాలో లక్ష్మణ్ పంపడం బీజేపీలో చాలామందికి కంటగింపుగా ఉంది. ఎంపీ పదవి కోసం విజయశాంతి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ తదితరులు పోటీపడినా.. పార్టీని ఎన్నాళ్లుగానో నమ్ముకన్న లక్ష్మణ్ ను వరించింది. ఇప్పుడు లక్ష్మణ్ పాల్గొన్న కార్యక్రమం అనంతరం విజయశాంతి చేసిన వ్యాఖ్యలను చూస్తుంటే ఆమె అసంతృప్తి అంతా ఎంపీ పదవి దక్కనందుకే అని స్పష్టమవుతోంది.