Begin typing your search above and press return to search.

నాడు దెబ్బేసిన వ్యక్తినే నేడు దగ్గరకు తీసుకున్నారే

By:  Tupaki Desk   |   12 Dec 2015 7:48 AM GMT
నాడు దెబ్బేసిన వ్యక్తినే నేడు దగ్గరకు తీసుకున్నారే
X
కేసీఆర్.. విజయరామారావుల మధ్య లెక్క చాలా చిత్రమైంది. కాలం ఎలాంటి వారిని ఎలా చేస్తుందనటానికి వీరిద్దరి ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. గతంలో ఏ వ్యక్తి కారణంగా మంత్రి పదవి దక్కలేదో.. ఇప్పుడు అదే వ్యక్తిని తన పార్టీలోకి చేర్చుకోవటం చూసినప్పుడు రాజకీయాలెంత సిత్రమైనవి అనిపించక మానదు. కేసీఆర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లటానికి..టీఆర్ఎస్ పార్టీ పెట్టటానికి? తెలంగాణ ఉద్యమాన్ని తలకెత్తుకోవటానికి కారణం విజయరామారావే. తనకు మంత్రి పదవి రాకపోవటానికి కారణమైన విజయరామారావును.. ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి చేర్చుకోవటం ఆసక్తికరం.

ఇప్పుడొక్కసారి గతంలోకి వెళితే.. సీబీఐ డైరెక్టర్ గా పని చేసిన విజయరామారావును రిటైర్ అయ్యాక చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. ఆయన విజయం సాధించిన తర్వాత ఆయన్ను మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు బాబు క్యాబినెట్ లోమంత్రి పదవి దక్కలేదు. దీనికి గుస్సా అయిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. మంత్రి పదవి ఇవ్వకుండా డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటంతో.. ఆగ్రహించిన కేసీఆర్ పార్టీకి రాజీనామా చేసి.. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు.

అలా ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ వెళ్లిందో అందరికి తెలిసిందే. ఇక.. విజయరామారావు విషయానికి వస్తే.. 1999 ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి విజయం సాధించిన ఆయన.. అనంతరం 2004.. 2009ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. 2014లో ఆయనకు చంద్రబాబు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత కొద్దికాలంగా పార్టీకి విజయరామారావు దూరంగా ఉంటున్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత.. మాజీ మంత్రి దానం నాగేందర్ ను పార్టీలోకి తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రయత్నించటం.. వారి మధ్య నెలకొన్ని లెక్కల పంచాయితీల నేపథ్యంలో దానం చేరిక మధ్యలో ఆగిపోయింది. ఇదే సమయంలో.. విజయరామారావును కాంగ్రెస్ లో చేర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ కు బలమైన నేత లేకపోవటంతో విజయరామారావును పార్టీలోకి ఆహ్వానించారు. ఒకనాడు తనకు మంత్రి పదవి రాకపోవటానికి కారణమైన వ్యక్తిని.. నేడు కేసీఆర్ తన పార్టీలోకి ఆహ్వానించటం.. అందుకు ఆయన అంగీకరించి పార్టీలో చేరటం చూసినప్పుడు కాలం ఎంత చిత్రమైనది అనిపించక మానదు.