Begin typing your search above and press return to search.

హోదా ప్రస్తావన తెచ్చి 3 పార్టీలపై ఫైర్

By:  Tupaki Desk   |   8 Feb 2022 5:30 AM GMT
హోదా ప్రస్తావన తెచ్చి 3 పార్టీలపై ఫైర్
X
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు ఇచ్చిన హ్యాండ్ అంతా ఇంతా కాదన్న సంగతి తెలిసిందే. దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్ రాజ్యసభలో ఇచ్చిన హామీని పక్కన పెట్టేసి.. కోట్లాది మంది ఆంధ్రులకు నష్టం వాటిల్లేలా చేసిన ఉదంతంలో మొదటి ముద్దాయి మాత్రం మోడీనే అవుతారని చెప్పక తప్పదు.

హోదా వ్యవహారంపై మోడీ సర్కారు తమ వైఖరిని పలుమార్లు స్పష్టం చేయటం తెలిసిందే. తాజాగా.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ప్రసంగించే అవకాశాన్ని పొందిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి చెలరేగిపోయారు.

హోదా అంశాన్ని చర్చకు తీసుకురావటం ద్వారా.. అటు కేంద్రంలోని మోడీ సర్కారును.. హోదాను ఇచ్చిన కాంగ్రెస్ ను.. మోడీ సర్కారుతో ప్రత్యేక ప్యాకేజీకి ఓకే చేసుకున్న టీడీపీపైనా విరుచుకుపడ్డారు. హోదా అంశాన్ని తీసుకురావటం ద్వారా.. మూడు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసే వాదనల్ని విజయసాయి వినిపించారు.

ప్రత్యేక హోదాపై కేంద్రం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నట్లుగా పేర్కొన్న ఆయన.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక నీతి? ఇతర రాష్ట్రాలకు మరో నీతా? అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వటానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుంటిసాకులు చెబుతోందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా పలు అంశాల్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. అవేమన్నది విజయసాయి మాటల్లోనే చూస్తే..

- అధికారంలోకి వచ్చాక వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడం లేదంటూ ఆరోపించడం టీడీపీకి దినచర్యగా మారింది. సభ సాక్షిగా కొన్ని వాస్తవాలు తెలపాల్సి ఉంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడుసార్లు ప్రధాని మోదీ తో.. 12సార్లు హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు.

- ప్రతిసారీ హోదా అంశాన్ని ప్రస్తావించాం. ఇటీవల తిరుపతిలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులోనూ అమిత్‌షాను హోదా గురించి డిమాండు చేశాం. ఈ అంశంపై చర్చకు గత పార్లమెంట్‌ సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇచ్చి ఉభయ సభలను స్తంభింపచేశాం.

- ఏపీకి ప్రత్యేక హోదా నిరాకరించడానికి కేంద్రం కుంటిసాకులు చెబుతుంది. ఏపీకి ఇస్తే జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలూ డిమాండ్‌ చేస్తాయని కేంద్రం చెబుతోంది. నాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను విభజించినా ఏ రాష్ట్రం రాజధానిని కోల్పోలేదు. కానీ.. విభజనకు గురైన ఏపీ హైదరాబాద్‌ను కోల్పోయింది.

- విభజనకు గురైన ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెం ట్‌ సాక్షిగా ప్రధానమంత్రి వాగ్ధానం చేశారా? ఏపీకి హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటించిన విషయం వాస్తవం కా దా?.. అలాగే, ఆర్థిక వెనుకబాటు ప్రాతిపదికన హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది.

ఆర్థిక ప్రా తిపదికన ఏపీకి హోదా ఇస్తే వెనుకబడిన ఒడిశా, బిహార్‌లూ హోదా కోసం డిమాండ్‌ చేస్తాయన్న కారణాన్ని కేంద్రం చూపిస్తోంది. ఒడిశా, బిహార్‌లు ఆర్థికంగా వెనకబడిన వాస్తవం నాడు మన్మోహన్‌ సింగ్‌కు తెలియదా?

- విభజన చట్టంలో ఎక్కడా ‘హోదా’ ప్రస్తావనే లేనందున మంజూరు చేయలేమని కేంద్రం చెబుతోంది. ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పుడు ఉత్తరప్రదేశ్‌ విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదాను ఇవ్వలేదా? బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక న్యాయం, బీజేపీయేతర రాష్ట్రాలకు ఒక న్యాయమా? ‘హోదా’ రాజకీయంగా సాధ్యపడే అంశం కాదనడం కేంద్రానికి సరికాదు. గతేడాది పాండిచ్చేరి ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా ఇస్తామని అనలేదా?

- హోదా బదులు ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాం కదా అని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించి చంద్రబాబు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు.

- మరోవైపు.. ఏపీతో పాటు విభజన కారణంగా రాజధానిని కోల్పోయిన ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలి. ఇదే విషయాన్ని కామర్స్‌ పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ తన 164వ నివేదికలో సిఫార్సు చేసింది. ఇప్పటికైనా ఏపీకి హోదా ఇవ్వాలి.

ఏపీ నికర రుణ సేకరణ పరిమితిని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాం లో పరిమితికి మించి చేసిన అప్పులు, అస్తవ్యస్త ఆర్థిక నిర్వహణ వంటి తప్పిదాలకు ఇప్పుడు ఏపీని శిక్షించడం తగదు.