Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు విజయసాయిరెడ్డికి దక్కిన ఆ పదవి!

By:  Tupaki Desk   |   20 Dec 2022 10:30 AM GMT
ఎట్టకేలకు విజయసాయిరెడ్డికి దక్కిన ఆ పదవి!
X
వైసీపీలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరంటే అంతా విజయసాయిరెడ్డి పేరే చెబుతారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌గా ఇలా పలు పదవులను వైఎస్‌ జగన్‌.. విజయసాయిరెడ్డికి కట్టబెట్టారు.

వైసీపీ తరఫున వరుసగా రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతున్నారు. అంతేకాకుండా వివిధ పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్‌ గా, సభ్యుడిగానూ విజయసాయిరెడ్డి కొనసాగుతున్నారు. అంతేకాకుండా కేంద్రంలో ప్రభుత్వ పెద్దలు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తదితరులతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలను విజయసాయిరెడ్డి కొనసాగిస్తున్నారు.

కాగా ఇటీవల రాజ్యసభ వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ లో విజయసాయిరెడ్డి పేరు కూడా వినిపించింది. ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. రాజ్యసభకు చైర్మన్‌ గా ఉపరాష్ట్రపతి ఉంటారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌ రాజ్యసభ చైర్మన్‌ గా ఉన్నారు. ఈయనే రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకపోతే డిప్యూటీ చైర్మన్‌ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షుడిగా ఉంటారు.

చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ అందుబాటులో లేకపోతే రాజ్యసభలో సీనియర్‌ సభ్యులను సమావేశాల నిర్వహణకు ఆటంకం కలగకుండా వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ సభ్యులుగా నియమిస్తారు. చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ లేనప్పుడు వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ లో ఉన్నవారు అధ్యక్షత బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డితోపాటు ప్రముఖ క్రీడాకారిణి పీటీ ఉషను కూడా వైస్‌ చైర్మన్‌ ప్యానల్‌ లో నియమించారు.

ఈ మేరకు తాజా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యసభలో జగదీప్‌ ధనకర్‌.. విజయసాయిరెడ్డి పేరును చదివి వినిపించారు. కొద్ది రోజుల క్రితం విజయసాయిరెడ్డి పేరు తెరపైకి వచ్చినప్పటికీ ఆయన పేరును చదవలేదు.

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు.. విజయసాయిరెడ్డి చేస్తున్న ట్వీట్లను ఇంగ్లిష్‌ లోకి అనువదించి ఉపరాష్ట్రపతికి చూపారని.. విజయసాయిరెడ్డి భాషపై అభ్యంతరం వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. ఈ కారణంతోనే విజయసాయిరెడ్డి పేరును ప్యానల్‌ వైస్‌ చైర్మన్‌ జాబితాలో చేర్చలేదని టాక్‌ నడించింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన ఏ2కి కీలక పదవి ఏమిటని మండిపడ్డాయి. అయితే ఎట్టకేలకు విజయసాయిరెడ్డి రాజ్యసభ ప్యానల్‌ వైస్‌ చైర్మన్‌ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.