Begin typing your search above and press return to search.

విజయసాయిరెడ్డి లాజిక్ ఇది : మోడీ కంటే జగనే బెటరా...?

By:  Tupaki Desk   |   28 July 2022 9:19 AM GMT
విజయసాయిరెడ్డి లాజిక్ ఇది : మోడీ కంటే జగనే బెటరా...?
X
దేశంలో ఎనిమిదేళ్ళుగా అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్ధిక పరిస్థితి కలవరపడే స్థాయిలో ఉంది అని విపక్షాలు ఎపుడూ ఘాటు విమర్శలు చేస్తాయి. రూపాయి ఎన్నడూ లేనంతగా చితికిపోయి చిక్కి శల్యం అవుతోంది అని కూడా అంటారు. ఇక ఆర్ధిక నిపుణులు అయితే ఈ దేశం ఏమైపోతోందో అని కూడా బెంగ పడుతూ తరచూ ప్రింట్ మీడియాలో వ్యాసాలు రాస్తూనే ఉంటారు. అయితే ఎవరెన్ని రాసినా ఏమి చేసినా ఇంతవరకూ మోడీ భక్తులతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే పార్టీలు మాత్రం ఈ విషయంలో కిక్కురుమనడంలేదు.

ఇక వైసీపీ తీరు చూస్తే ఆ పార్టీ బీజేపీకి మిత్ర పక్షం కానీ మిత్రపక్షం. బయట జనాలకు చెప్పుకోవడానికి వారు మేమేమీ ఎంన్డయేలో ఉన్నామా అని దబాయింపుగా అంటారు. కానీ వారు పూర్తిగా బీజేపీకి మూడేళ్ళుగా మద్దతు ఇస్తూ పోతున్నారు. ఇవన్నీ పచ్చి నిజాలు, జనాలకు తెలిసిన విషయాలు. ఇక దేశం మూడేళ్లుగా ఏమైపోతున్నా వైసీపీ నుంచి ఘాటు విమర్శ ఒక్కటీ రాలేదు. కానీ ఇపుడు కేంద్రం ఏపీ అప్పుల లెక్కలు బయటకు తీయడంతో ఎందుకో ఆ పార్టీ నేతలకు ఆగ్రహం వస్తోంది.

దాంతో మొన్నటికి మొన్న ఏపీ అప్పుల మీద కేంద్రం ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేసరికి వైసీపీ ఎంపీలు కేంద్రం అప్పుల మీద ఫస్ట్ టైమ్ విమర్శలు చేశాయి. అయితే అది అంతటితో ఆగలేదు. లోక్ సభ రాజ్యసభలలో కూడా ఏపీ అప్పుల మీద కేంద్రం వివరాలను టీడీపీ ఎంపీలు కోరిన మీదట రిలీజ్ చేసింది. అంతే కాదు దొరికిన కాడికల్లా ఏపీ ఎడా పెడా అప్పులు చేస్తోంది అని కేంద్ర మంత్రులు ప్రకటించడం కూడా పుండు మీద కారం చల్లినట్లుగా వైసీపీకి ఉంది అంటున్నారు.

దీంతో ఇపుడు ఏకంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆయన కేంద్రం మీద ఫైర్ అయ్యారు. మా అప్పులు అంటున్నారు. సరే కానీ మీ సంగతేంటి అని నేరుగానే ప్రశ్నించారు. ఏపీ చేసిన అప్పులు చాలా తక్కువ. కేంద్రం చేసే అప్పులు ఎక్కువ అంటూ ఒక పోలిక కూడా తెచ్చారు. అంతే కాదు ఏపీ ఒక సమర్ధ నాయకత్వంలో ఉంది. జగన్ చాల బాగా పాలిస్తున్నారు అని కితాబు ఇచ్చారు. అదే టైమ్ లో దేశంలో అప్పులు పేరుకుపోయాయీ అంటే ఎవరిది తప్పు అన్నట్లుగా ప్రశ్నించారు.

అలాగే చూస్తే 2021-22 ఆర్ధిక సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది అని ఆయన విశ్లేషించారు. మరో వైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే అప్పుల ఆదాయం బాగా తగ్గిపోయింది అని విమర్శలు చేశారు. కేంద్రం తన ఆదాయాన్ని పెంచుకుంటున్నా రాష్ట్రాలకు ఏమీ పెద్దగా విదల్చడం లేదని కూడా చెప్పుకొచ్చారు.

రాష్ట్రాలకు ఇస్తున్న పన్నుల వాటా 41 శాతం అని చెబుతున్నా నిజానికి అంత ఏమీ ఇవ్వడంలేదని కూడా వాస్తవాన్ని చెప్పేశారు. ఇక విజయసాయిరెడ్డి కేంద్రం అప్పుల చిట్టా చదివి వినిపించారు. కేంద్రం చేసిన అప్పులు 2014 నుంచి 2019 దాకా చూస్తే గతానికంటే అరవై శాతం పెరిగాయి. ఇక 2019 నుంచి గత మూడేళ్ళుగా చూసే మరో మరో యాభై శాతం అప్పులను మోడీ సర్కార్ చేసింది అని ఆ జాబితాను బయటపెట్టారు.

అదే జగన్ మూడేళ్ల పాలనలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయని, చంద్రబాబు ఏలుబడి అయిదేళ్ళలో 117 శాతం అప్పులు చేశారని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తానికి మోడీ సాబే అసలైన అప్పుల అప్పరావు అని సాయిరెడ్డి తేల్చేశారు. ఏపీలో తన ప్రత్యర్ధి చంద్రబాబు మించిన అప్పులు చేసిన వారూ లేరని కూడా క్లారిటీ ఇచ్చేశారు. బాబు మీద విమర్శలు ఓకే అనుకున్నా మోడీ ఇన్నేసి అప్పులు చేశారు అని వైసీపీ విమర్సించడమే ఇపుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్. పైగా ఏపీలో జగన్ బాగా పని చేస్తున్నారు అని పోలిక పెట్టడం అంటే మోడీని తక్కువ చేయడమేనా అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.