Begin typing your search above and press return to search.

విశాఖ ఉక్కుపాపమంతా వాళ్లదే.. విజయసాయి సంచలనం

By:  Tupaki Desk   |   21 Feb 2021 6:30 AM GMT
విశాఖ ఉక్కుపాపమంతా వాళ్లదే.. విజయసాయి సంచలనం
X
విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే విషయంలో తెలుగువారంతా తీవ్ర ఆగ్రహంతో పాటు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు.. సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగటం తెలిసిందే. తాజాగా విశాఖలో పర్యటించిన ఆయన.. పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే విషయంలో తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాదు.. విశాఖను ప్రైవేటీకరించే అంశానికి సంబంధించి కీలక బాధ్యత పలువురు ఉన్నతాధికారులేనని.. వారంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేదన్నారు. ఈ కారణంతోనే.. వారికి విశాఖ ఉక్కు కర్మాగారంపై పట్టటం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధం లేని వారు ఉన్నత స్థానాల్లో ఉండటం వల్ల వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టటం లేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్న విజయసాయి.. పోరాడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను వదులుకోవటానికి ఏ మాత్రం సిద్ధంగా లేమన్నారు.

ఈ అంశంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పోస్కో ప్రతినిధులకు సీఎం జగన్ గతంలోనే స్పష్టంగా చెప్పారన్న విజయసాయి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రావొద్దని ఆ కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారన్నారు. విశాఖను వదిలి క్రిష్ణపట్నం.. కడపలో ఏర్పాటు చేసుకోవాలని.. అందుకు అవసరమైన భూమిని ఇస్తామని చెప్పినట్లు వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంతంగా గనులు లేవని.. ప్రకాశం జిల్లాలో ఉన్నా అవేమీ ప్రయోజకరం కాదన్నారు.

గనుల సమీకరణకు ఒడిశాకు రూ.1500 కోట్లు ఇచ్చాం కానీ ఇప్పటివరకు టన్ను గనుల సమీకరణ జరగలేదన్నారు. స్టీల్ ప్లాంట్ కు రూ.20వేల కోట్ల రుణ భారం ఉందని.. రుణాల్ని దాదాపు రూ.2700 కోట్ల వడ్డీ కడుతున్నట్లు చెప్పారు. రుణ భారంతోనే స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని.. ఈ భారాన్ని కేంద్రం ఈక్విటీగా మారిస్తే లాభాల్లోకి వెళుతుందన్నారు. ఇవే అంశాలతో ప్రధాని మోడీకి సీఎం జగన్ లేఖ రాశారన్నారు.