Begin typing your search above and press return to search.

వైసీపీ పొత్తు పై విజ‌య‌సాయిరెడ్డి క్లారిటీ

By:  Tupaki Desk   |   7 May 2022 11:31 AM GMT
వైసీపీ పొత్తు పై విజ‌య‌సాయిరెడ్డి క్లారిటీ
X
రాబోయే ఎన్నిక‌ల‌కు సంబంధించిన హడావుడి ఇప్ప‌టికే ఏపీలో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌ల్లో పెడుతున్నాయి. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు అయితే ఏకంగా పొత్తుల గురించి హింట్ ఇచ్చేశారు.

విప‌క్షాల ఐక్య‌త‌తోనే సీఎం జ‌గ‌న్ ను గ‌ద్దె దించ‌గ‌ల‌మ‌ని పేర్కొన్న వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు తాము నాయ‌క‌త్వం వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు. అయితే, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి ఏంట‌నే ఆస‌క్తి స‌హ‌జంగానే ఉంటుంది. ఇలాంటి స‌మ‌యంలోనే రాబోయే ఎన్నిక‌ల్లో పొత్తు గురించి వైసీపీ కీల‌క నేత‌, ఎంపీ విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు.

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ లో YSR కాంగ్రెస్ పార్టీ మెగా జాబ్ మేళాను ప్రారంభించిన ఎంపీ విజయసాయి రెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుంద‌ని ఆయ‌న తేల్చిచెప్పారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని విజయసాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఓటమి భయంతోనే కొందరు పొత్తులు పెట్టుకుంటారని ఎద్దేవా చేసిన విజ‌య‌సాయిరెడ్డి... ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకున్న వైకాపా విజయాన్ని ఆపలేరని స్ప‌ష్టం చేశారు. మరో 20, 25 ఏళ్ళు అధికారంలో ఉంటామ‌ని విజ‌య‌సాయిరెడ్డి ధీమా వ్య‌క్తం చేశారు.

టీడీపీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడును ప్రజలు ఎప్పుడో తిరస్కరించార‌ని పేర్కొన్న విజ‌య‌సాయిరెడ్డి ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేద‌ని వ్యాఖ్యానించారు. అధికారం చంద్ర‌బాబు వదులుకోలేద‌ని పేర్కొన్న విజ‌య‌సాయిరెడ్డి ఆయననే ప్రజలు వద్దనుకున్నారని కామెంట్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు టీడీపీ వారు చేసినవే అని ఆరోపించిన విజ‌య‌సాయిరెడ్డి తిరిగి ప్రభుత్వం పైన బురద జల్లుతున్నార‌ని మండిప‌డ్డారు.