Begin typing your search above and press return to search.

మరణం ముందు చివరి ఊపిరి... కాంగ్రెస్ మీద కసిగానే...?

By:  Tupaki Desk   |   31 Aug 2022 11:31 AM GMT
మరణం ముందు చివరి ఊపిరి... కాంగ్రెస్ మీద కసిగానే...?
X
ఈ దేశాన్ని దశాబ్దాల పాటు ఏలిన పార్టీ కాంగ్రెస్. ఆ పార్టీ రాజకీయం ఇపుడు ఏ మాత్రం బాగులేదు. వరసబెట్టి రెండు ఎన్నికల్లో ఓటమి పాలు అయింది. 2024లో అయినా గెలుపు తీరాలకు పార్టీని చేర్చకపోతే ఇక చరిత్రలో కలిసిపోతుంది అన్న బెంగ కాంగ్రెస్ వాదులలో ఉంది. బహుశా ఇదే ఆలోచన కాంగ్రెస్ పెద్దలలో కూడా ఉండి ఉండాలి. అందుకే భారత్ జోడో పేరిట 3700 కిలోమీటర్ల మేర అతి పెద్ద పాదయాత్రకు రాహుల్ గాంధీ రెడీ అవుతున్నారు.

సెప్టెంబర్ 7 నుంచి మొదలయ్యే ఈ యాత్ర దేశంలోని పన్నెండు రాష్ట్రాలను టచ్ చేసేలా డిజైన్ చేశారు. ఈ యాత్ర మీద ఇప్పటిదాకా విపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. జాతీయ స్థాయిలో అయితే బీజేపీ దీన్ని గట్టిగా విమర్శించాలి. ఎందుకంటే రాహుల్ తమకు అసలైన ప్రత్యర్ధి కాబట్టి. కానీ వైసీపీకి చెందిన పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి రాహుల్ పాద‌యాత్ర మీద తనదైన శైలిలో కామెంట్స్ చేశారు.

ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ లో ఎలాంటి అద్భుతాలూ జరిగిపోవని, ఆ పార్టీ మరణానికి ముందు పీల్చుకుంటున్న చివరి ఊపిరి ఈ యాత్ర అని చాలా ఘాటైన పదజాలంతోనే ఆయన ట్వీట్ చేశారు. నిజంగా ఇంత పెద్ద విమర్శ ఎవరూ దేశంలో ఇప్పటిదాకా కాంగ్రెస్ మీద చేయలేదు. బీజేపీ కూడా కాంగ్రెస్ ఓటమిని కోరుకుంటోంది కానీ మరణాన్ని కాదు, మరి విజయసాయిరెడ్డి మాత్రం కాంగ్రెస్ కి మరణ ఘడియలు ఆసన్నం అయ్యాయని చెప్పేస్తున్నారు. అంతే కాదు పాదయాత్ర అన్నది చివరి ఊపిరిగా అభివర్ణిస్తున్నారు.

ఇక 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏవీ లేవని కూడా ఆయన జోస్యం చెబుతున్నారు. అంతే కాదు నెహ్రూ కుటుంబం ఎన్నికల్లో గెలవకపోయినంతమాత్రాన దేశానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని కూడా తేల్చారు. దేశం ఎపుడూ ఐక్యంగానే ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. ఎపుడూ కూడా భారత్ విచ్చిన్నం కానే కాదు అని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఇక భారత్ జోడో పాదయాత్ర పేరుని కాస్తా మృత్యువు ముందు చివరి శ్వాస అని మార్చుకుంటే బాగుంటుందని కూడా సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ని జాతీయ స్థాయిలో విజయసాయిరెడ్డి విమర్శించడం ఇది మొదటి సారి కాదు, ఆయన అంతకు ముందు కూడా ఇలాంటి విమర్శలే చేశారు.

ఆ మధ్యన ఈడీ ముందు తల్లీ కొడుకులు సోనియాగాంధీ రాహుల్ గాంధీ విచారణకు కూర్చోవడాన్ని కూడా ఆయన కర్మతో పోల్చారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు అంటూ నాడు ఆయన చేసిన ట్వీట్ సెగలు పుట్టించింది. మొత్తానికి విజయసాయిరెడ్డి కి కాంగ్రెస్ మీద దాని నాయకత్వం మీద ఉన్న కసి ఏంటో ఆయన వరస ట్వీట్లే చెబుతున్నాయని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.