Begin typing your search above and press return to search.

కర్మ కాలిందా : నాటి పాపాలే వెంటాడుతున్నాయా...?

By:  Tupaki Desk   |   15 Jun 2022 12:30 PM GMT
కర్మ కాలిందా : నాటి పాపాలే వెంటాడుతున్నాయా...?
X
భారత దేశం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ఒకనాటి తెలిసో తెలియకో చేసిన పాపాలు శాపాలుగా మారి వెంటాడుతాయి అని చెబుతారు. ఆ విధంగా చూసుకుంటే ఇపుడు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని ఆ పార్టీ పెద్దలను ఒకనాటి కర్మ వెంటాడి ఈ రోజు ఇలా ఈడీ ముందు గంటల తరబడి విచారణకు కూర్చునులా చేస్తోందా. అంటే అవును అదే అంటున్నారు వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి రెడ్డి. ఆయన ఢిల్లీలో మీడియాతో తాజాగా మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు.

ఎవరైనా కర్మ నుంచి తప్పించుకోలేరని ఆయన అంటున్నారు. అవి వెంటాడితీరుతాయని కూడా అన్నారు. విజయసాయిరెడ్డి ఈ రకమైన కామెంట్స్ చేయడం వెనక ఒక బిట్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆనాడు వైఎస్ జగన్ కాంగ్రెస్ ని వీడిన తరువాత సీబీఐ ఈడీ విచారణలను ఆయన ఎదుర్కొన్నారు. అంతే కాదు ఏకంగా పదహారు నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. నాడు ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

అది మరచిపోలేని చేదు అనుభవం. ఎవరైనా విచారణ సంస్థల ముందు గంటల తరబడి రోజుల తరబడి కూర్చోవడం అంటే అంతకంటే అవమానం వేరొకటి ఉండదు. అందుకే విజయసాయిరెడ్డి ఇపుడు అదే రకమైన అవమానాన్ని అనుభవిస్తున్న రాహుల్ విషయంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దాని అర్ధం ఏమిటి అంటే ఆనాడు అధికారం అడ్డుపెట్టుకుని తనను జగన్ని కాంగ్రెస్ పెద్దలు నానా రకాలుగా ఇబ్బందులు పెట్టారని, ఆ పాప ఫలితమే ఈనాడు రాహుల్ ఈడీ ముందు విచారణకు రావడం అన్న మాట.

ఇదిలా ఉంటే ఈ కేసు విషయంలో చట్టం తన పని తాను చేస్తోంది తప్ప బీజేపీ సర్కార్ కక్ష సాధింపు ఏదీ లేదని విజయసాయిరెడ్డి సమర్ధించడం విశేషం. 2012లో బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి నేషనల్ హెరాల్డ్ ఆస్తులను అక్రమంగా కాంగ్రెస్ పెద్దలు చేజిక్కించుకున్నారు అని దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపడుతోందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.

ఈ విషయంలో బీజేపీ సర్కార్ కి ఏమిటి సంబంధం అని ఆయన అచ్చం బీజేపీ ఎంపీ మాదిరిగానే ప్రశ్నిస్తున్నారు. మరో వైపు చూస్తే దేశంలో రాష్ట్రపతి ఎన్నికల వేళ వైసీపీ మద్దతు కీలకం అని భావిస్తున్న వేళ బీజేపీకి అనుకూలంగా జగన్ కుడిభుజం లాంటి విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా తమ ఓటు ఎటువైపే చెప్పేశారు అంటున్నారు.

మొత్తానికి బీజేపీతోనే వైసీపీ ఉంటుంది అన్నది విజసాయిరెడ్డి బల్లగుద్దకుండానే చెప్పేశారు అనుకోవాలి. అదే విధంగా తమను అప్పట్లో కేసులు పెట్టి ఇరికించి ఈ రోజుకీ దాని వలలో తాము చిక్కుకునేలా చేసిన కాంగ్రెస్ అంటే పీకల లోతు కోపం కూడా ఉందని ఆయన మాటలను బట్టి తెలుస్తోంది.

మరి రాహుల్ గాంధీ ఈ రోజు విచారణకు వచ్చారు. అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ అందుబాటులో లేరు. రేపటి రోజున ఆమె కూడా వస్తారు అని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ ని కర్మ వెంటాడుతోందా అంటే విజయసాయిరెడ్డి చెప్పకపోయినా ఏదో పాపం శాపంగా మారి ఆ పార్టీని అలా కట్టి కుదుపుతోందని మాత్రం హిందూ ఫిలాసఫీని నమ్మిన వారు అంటారు అందుకే రెండు సార్లు దారుణ పరాజయం, ఈ రోజు నాయకత్వ సంక్షోభం దాంతో పాటు ఇపుడు కేసులు టోటల్ గా కాంగ్రెస్ ఇపుడు శాపగ్రస్థ అని మాత్రం ఒప్పుకోవాలేమో.