Begin typing your search above and press return to search.

రేవంత్ ఖతం.. ఇప్పుడు విజయశాంతి..

By:  Tupaki Desk   |   28 Dec 2018 8:15 AM GMT
రేవంత్ ఖతం.. ఇప్పుడు విజయశాంతి..
X
తెలంగాణలోనే బలమైన కేసీఆర్ అండ్ ఫ్యామిలీని తిట్టడమే పనిగా పెట్టుకొని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో ఫేమస్ అయ్యారు. కేసీఆర్- కేటీఆర్- హరీష్ - కవితలను తిట్టకుండా ఒక్కరోజు కూడా రేవంత్ ఉండలేకపోయారు. కేసీఆర్ పై రేవంత్ దారుణ ఆరోపణలు ఎన్నికల వేళ ప్రతిరోజు మీడియాలో హైలెట్ అయ్యాయి. కానీ ఇటీవల ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ భారీ విజయం సాధించడం... హేమాహేమీలు ఓడిపోవడం.. రేవంత్ కూడా పరాజయం పాలు కావడంతో ఇక బయటకు రావడం లేదు. రాజకీయాల్లో ఆయన పరపతి- ప్రతిష్ట కూడా దిగజారింది.

ఇప్పుడు రేవంత్ సైడ్ అయిపోవడంతో ఆయన స్థానాన్ని భర్తీ చేసే పనిలో కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, నటి విజయశాంతి బిజీగా ఉన్నారట.. రేవంత్ లాగే దూకుడుగా కేసీఆర్ ఫ్యామిలీని ఎదుర్కోవాలని.. కాంగ్రెస్ లో ఎదగాలని ఆమె ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది. తాజాగా విజయశాంతి సోషల్ మీడియా పై పడ్డారు. ఇందులో కేసీఆర్ అండ్ ఫ్యామిలీ పై ఏ చిన్న అవకాశం వచ్చినా నిలదీస్తూ కడిగిపారేస్తున్నారు.

తాజాగా ఫేస్ బుక్ లో కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు గుప్పించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు కావస్తున్నా ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదని.. రాష్ట్ర కేబినెట్ ను ఏర్పాటు చేయలేదని.. ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే లేకుండా పోయారని.. ఇదీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత ప్రజాస్వామ్య పరిస్థితి’ అని విజయశాంతి కడిగిపారేశారు.

ఇక ఇటీవల హైదరాబాద్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో ముస్లిం యువకులు పోలీసుల పై దాడి చేయడాన్ని విజయశాంతి ప్రస్తావించి విమర్శించారు. ‘సోషల్ మీడియాలో గ్లోబల్ హాస్పిటల్ లో పోలీసులను ముస్లిం యువకులు కొట్టినట్టు స్పష్టంగా ఉంది. ఈ దాడులను చూసిన తెలంగాణ ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు.’ అని ఫేస్ బుక్ లో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ రకమైన పరిస్థితులు కనిపించలేదని.. తెలంగాణ ప్రజలు ఈ రకమైన దాడులకు మద్దతు ఇవ్వరని విజయశాంతి స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇటువంటి దాడులు చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ ఎస్ లో చేర్చుకున్నారని.. ప్రజలు కూడా ఆయన్ను ఫాలో అయితే తెలంగాణ పరిస్థితి ఏంటని నిలదీశారు.