Begin typing your search above and press return to search.

సారు ఫ్యూచర్ ప్లాన్ ఇదేనంటూ ఎక్కేసిన ఫైర్ బ్రాండ్

By:  Tupaki Desk   |   28 Nov 2019 5:18 AM GMT
సారు ఫ్యూచర్ ప్లాన్ ఇదేనంటూ ఎక్కేసిన ఫైర్ బ్రాండ్
X
ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తో తరచూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఘాటుగా రియాక్ట్ అయ్యే మహిళా నేతగా విజయశాంతిని చెప్పాలి. తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ పదవిలో ఉన్న ఆమె.. గాంధీ భవన్ లో ఒక్కరోజు కూడా కనిపించరు. ఆ మాటకు వస్తే మీడియాతో మాట్లాడేది తక్కువ. తన సోషల్ మీడియా ఖాతాలో భారీ పోస్టు పెట్టేసి గమ్మున ఉండే సిత్రమైన అలవాటున్న విజయశాంతి.. పదునైన వాదనను కేసీఆర్ పై విరుచుకుపడటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది.

తాజాగా తన మార్క్ పోస్టును ఫేస్ బుక్ లో పెట్టారు విజయశాంతి. సారు ప్యూచర్ ప్లాన్ ఇదేనంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన రాములమ్మ.. ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమే సీఎం వ్యూహని చెప్పారు.

ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అసరా చేసుకొని మిగిలిన శాఖలకు చెందిన ఉద్యోగులపై పంజా విసరటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వాదన వినిపించారామె.

అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా చేసిన సీఎం దొరగారు.. సమ్మెను అసరా చేసుకొని తెలంగాణలోని ప్రభుత్వ శాఖలన్నింటిని కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చపోతున్నారనే అనుమానాలు బలపడుతున్నట్లుగా ఆమె మండిపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి.. దాని ద్వారా మొత్తం వ్యవస్థల్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలన్నదే కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందన్నారు.

సచివాలయానికి వెళ్లకుండా ప్రగతిభవన్ నుంచి ప్రభుత్వ కార్యకలాపాల్ని చక్కపెడుతున్న సీఎం దొరగారు.. అదే వ్యవస్థను ప్రభుత్వ శాఖల్లో కూడా అమలు చేయాలనుకోవటం దురదృష్టకరంగా అభివర్ణించారు. ఆర్టీసీతో మొదలైన కేసీఆర్ ప్రభుత్వ ఆరాచకం.. రెవెన్యూ శాఖకు కూడా విస్తరించనుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రెవెన్యూ తర్వాత మిగిలిన శాఖలకు కూడా వ్యాపించబోతోందన్న సందేహం తెలంగాణ ప్రజల్లో బలపడుతోందన్నారు.

ఆర్టీసీ సమ్మెకు ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని చేతులు దులుపుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. సమ్మె కారణంగా కార్మికుల ప్రాణాలు కోల్పోవటానికి కూడా ప్రతిపక్షాలు బాధ్యత వహించాలని వితండవాదన చేస్తుందన్నారు. కేసీఆర్ సర్కారు వాలకం చూస్తుంటే.. మెట్రో స్టేషన్ పైకప్పు పెచ్చులు ఊడిపడి అమాయకురాలు ప్రాణాలు కోల్పోతే అది కూడా ప్రతిపక్షాల బాధ్యతేనా? అని ఎద్దేవా చేశారు.

‘‘మొన్న ఓ లారీ డ్రైవర్ తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్ గా బస్సును దురుసుగా నడిపి ఓ ఐటీ ఉద్యోగి ప్రాణాలు తీసిన ఘటనకు కూడా ప్రతిపక్షాలే కారణమని ఆరోపిస్తారేమో? హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ పై నుంచి కారు కిందకి దూసుకువచ్చి ప్రాణాలు తీసిన ప్రమాదానికి కూడా ప్రతిపక్షాల కుట్రే కారణమని దొరగారు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు! తన వైఫల్యాలను ప్రతిపక్షాలకు మీదకు నెట్టడం కెసిఆర్ గారికి కొత్తేమీ కాదు. చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు త్వరలోనే ఈ అరాచకానికి సరైన తీర్పుని సంఘటిత పోరాటాల ద్వారా తెలియచేస్తారని విశ్వసిస్తున్నా’’ అంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.