Begin typing your search above and press return to search.

‘సర్జికల్‌ స్ట్రైక్స్​’ మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు? టీఆర్ ఎస్​ - ఎంఐఎంపై రాములమ్మ ఫైర్​

By:  Tupaki Desk   |   25 Nov 2020 11:50 AM GMT
‘సర్జికల్‌ స్ట్రైక్స్​’ మీరెందుకు ఉలిక్కిపడుతున్నారు?  టీఆర్ ఎస్​ - ఎంఐఎంపై రాములమ్మ ఫైర్​
X
పాతబస్తీలో ఉన్న రోహింగ్యాలు, పాకిస్థాన్​ వాళ్లను తరిమికొట్టేందుకు సర్జికల్​ జరుపుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అంటే టీఆర్​ఎస్​, ఎంఐఎం ఎందుకు ఉలిక్కిపడుతున్నాయని కాంగ్రెస్​ నేత విజయశాంతి ప్రశ్నించారు. ‘రోహింగ్యాలు పాతబస్తీలో లో ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అధికార టీఆర్​ఎస్​ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలి. అంతేకాని బండిసంజయ్​పై ఎదురుదాడికి దిగడంలో అర్థం లేదు. గతంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ అనేక సార్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారు. అప్పుడు టీఆర్​ఎస్​ ఎందుకు ఖండించలేదు. ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు రోజే అసదుద్దీన్​ ప్రగతిభవన్​కు వెళ్లి కేసీఆర్​ను కలిశారు. వీళ్లిద్దరూ మిత్రపక్షాలుగా కొనసాగుతున్నారు. మరి ఇప్పుడెందుకు డ్రామాలు ఆడుతున్నారు.

గతంలో అసదుద్దీన్​ ఒక్క 15 నిమిషాలు పోలీసులు సైలెంట్​గా ఉంటే మా సత్తా చూపుతానన్నాడు. మేం ఉమ్మేస్తే భాగ్యలక్ష్మి గుడి మునిగిపోతుందని వ్యాఖ్యానించాడు. హిందువులు పవిత్రంగా చూసే గోవును కూడా అవమానించేలా మాట్లాడాడు. అప్పుడు స్పందించని కేటీఆర్​. ఇప్పుడెందుకు వచ్చాడు. ఈ ఎన్నికల ముందు ఎంఐఎంతో ఏ సంబంధం లేదన్నట్టు టీఆర్​ఎస్​ డ్రామాలు ఆడుతుంది. వాళ్ల డ్రామాలను జనాలను నమ్మరు’ అంటూ విజయశాంతి ఘాటుగా ట్వీట్లు చేశారు.

విజయశాంతి ప్రస్తుతం కాంగ్రెస్​లోనే ఉన్నప్పటికీ ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కూడా ఆమె ప్రచారం చేయడం లేదు. త్వరలోనే విజయశాంతి బీజేపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో విజయశాంతి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల విజయశాంతి బీజేపీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్​ అధినాయకత్వం ఆమె ఇంటికి వెళ్లి బుజ్జగించినప్పటికీ ఆమె మెత్తబడలేదు. తాజాగా బీజేపీకి బహిరంగంగానే మద్దతు తెలపడంతో ఆమె త్వరలోనే కాంగ్రెస్​ వీడతారన్న వ్యాఖ్యలకు బలం చేకూరింది.