Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గూటికి విజ‌య‌శాంతి

By:  Tupaki Desk   |   17 Sep 2018 6:12 AM GMT
టీఆర్ ఎస్ గూటికి విజ‌య‌శాంతి
X
తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకునే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల హ‌డావుడిలో అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మదైన శైలిలో వ్యూహాల‌కు ప‌దునుపెడుతూ ముందుకు సాగుతుంటూ....ఆయా పార్టీల్లోని అంత‌ర్గ‌త రాజకీయాలు మ‌రింత ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. అంత‌ర్గ‌త స్వేచ్ఛ‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ ఒక‌నాటి టాప్ హీరోయిన్‌ - ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్ప‌టికీ ఆ పార్టీతో అంటీముట్ట‌న‌ట్లుగా ఉంటున్న‌ మాజీ ఎంపీ విజయశాంతి ఎపిసోడ్ క‌ల‌క‌లంగా మారింది. ఆమె తిరిగి టీఆర్ ఎస్‌ గూటికి చేరునున్నార‌నేది ఆ క‌ల‌క‌లం సారాంశం.

విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఇటీవ‌లి కాలంలో ఒకింత దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న మ‌హాకూట‌మి పొత్తును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ త‌మ అభిప్రాయం తెలియ‌జెప్పారు. తెలుగుదేశం తో పొత్తు తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అన్న అంశాన్ని కాంగ్రెస్ మరో సారి క్షేత్ర స్థాయిలో విశ్లేషించుకోవాలి అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతారాలు వస్తున్నట్టుగా సమాచారం వస్తోంది అంటూ పార్టీ నేత‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌న్నారు. విజ‌య‌శాంతి వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లానికి దారితీశాయి. అంత‌కుముందు ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ టూర్‌ లో కూడా గైర్హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ఆబ్సెంట్‌ కు కొద్దిరోజుల ముందే...ఆమె ఢిల్లీలో రాహుల్‌ గాంధీతో స‌మావేశ‌మ‌య్యారు. అనంత‌రం విజ‌య‌శాంతి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌ల వల్ల కొంత గ్యాప్ తీసుకున్నానని, అతి త్వరలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పాల్గొంటానని వివ‌రించారు. అధిష్టానంతో టచ్ లో ఉన్నానని, రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని పేర్కొంటూ పూర్తిగా పార్టీ బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాను అని రాహుల్‌ తో చెప్పానని విజ‌య‌శాంతి వివ‌రించారు. మీరు ఖచ్చితంగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారని వివ‌రించారు. నా తక్షణ లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడ‌మ‌ని అని ప్ర‌క‌టించారు.

ఇంత స్ప‌ష్టంగా త‌న మ‌న‌సులోని భావాన్ని మీడియా ద్వారా వెల్ల‌డించిన‌ప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ త‌న‌ను ప‌ట్టించుకోలేద‌నే భావ‌నలో విజ‌య‌శాంతి ఉన్న‌ట్లు స‌మాచారం. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో గాంధీభ‌వ‌న్ కేంద్రంగా పెద్ద ఎత్తున కార్య‌క్ర‌మాలు జరుగుతున్నా త‌న‌కు ఆహ్వానం ఉండ‌టం లేద‌ని, రాహుల్ టూర్‌కు కూడా త‌న‌కు ఆహ్వానం రాలేదంటే పార్టీ నేత‌లు త‌న‌ను గుర్తించ‌లేద‌నే ఆమె భావిస్తున్న‌ట్లు స‌మాచారం. అందుకే తిరిగి టీఆర్ఎస్‌లో చేరేందుకు స‌న్న‌ద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. టీఆర్ ఎస్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ కే కేశ‌వ‌రావుకు ఈ స‌మాచారం విజ‌య‌శాంతి చేర‌వేశార‌ని ఆయ‌న గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌కు రాములమ్మ ఆస‌క్తిని తెలియ‌జెప్పగా...ఆయ‌న పెద్ద‌గా స్పందించ‌లేద‌ని టాక్ ఉంది. ఎన్నిక‌లు అయిన త‌ర్వాత ఆమె టీఆర్ఎస్‌ పార్టీలో చేర‌వ‌చ్చ‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.