Begin typing your search above and press return to search.

కేసీఆర్ దాచిన విషయాన్ని చెప్పేసింది

By:  Tupaki Desk   |   13 Dec 2019 3:03 PM GMT
కేసీఆర్ దాచిన విషయాన్ని చెప్పేసింది
X
ఓవైపు సినిమాలు...మ‌రోవైపు రాజ‌కీయాల‌ను విజ‌య‌వంతంగా ఏక‌కాలంలో కొన‌సాగిస్తున్న ప్ర‌ముఖ న‌టి - తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ ప‌ర్సన్ విజయశాంతి తాజాగా ఆస‌క్తిక‌ర కామెంట్ల‌తో తెర‌మీద‌కు వ‌చ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండో ద‌ఫా ప‌గ్గాలు చేప‌ట్టిన టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌..మొద‌టి సంవ‌త్స‌రం పూర్తి చేసుకున్న త‌రుణంలో...విజ‌య‌శాంతి ఓ ఆస‌క్తిక‌ర రివ్యూ చేశారు. టీఆర్ ఎస్‌ ను చూసి జాతీయ పార్టీలైన టీఆర్ ఎస్‌ - కాంగ్రెస్ పార్టీలు సైతం త‌ట్టుకోలేకపోతున్నాయ‌ని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు.

కేసీఆర్ ఏడాది పాల‌న‌పై రాముల‌మ్మ ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. టీఆర్ ఎస్‌ కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. హుజూర్‌ నగర్ ఉప ఎన్నిక తర్వాత తెలంగాణ సమాజం ఇదే అభిప్రాయంతో ఉంద‌ని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌ ప‌ర్స‌న్ విశ్లేషించారు. `టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని - ముఖ్యమంత్రి దొరగారు - ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ కలిమితో ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు.` అంటూ ఎద్దేవా చేశారు.

మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి... ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ గారు సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని వియ‌శాంతి వ్యంగ్యంగా విమ‌ర్శించారు. ``ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచిస్తున్న కేసీఆర్ సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఏ మేరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉంది. ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కేసీఆర్ తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారు.` అంటూ మండిప‌డ్డారు.

ప్రభుత్వ ఖజానాను ముంచేసి - ఇంతకాలం మాయమాటలు చెప్పిన సీఎం దొరగారు... ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పలేదు అని విజ‌య‌శాంతి వ్యాఖ్యానించారు. ``ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి... ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు ఎంతో దూరంలో లేదు. ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా వేచి చూస్తున్నారు`` అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.