Begin typing your search above and press return to search.

మోదీ పెద్ద దొంగ‌!... కేసీఆర్‌ చిన్న దొంగ‌!

By:  Tupaki Desk   |   28 March 2019 11:36 AM GMT
మోదీ పెద్ద దొంగ‌!... కేసీఆర్‌ చిన్న దొంగ‌!
X
సినీ వినీలాకాశంలో అగ్ర తార‌గా ఎదిగి చివ‌ర‌కు ఓ ఉద్య‌మ తార‌గా రూపాంతరం చెందిన విజ‌య‌శాంతి... జ‌నాల మ‌దిలో రాములమ్మ‌గా స్థిర‌ప‌డిపోయాయి. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు తెర‌కెక్కించిన రాముల‌మ్మ చిత్రంలో లీడ్ రోల్ లో క‌నిపించిన విజ‌య‌శాంతి... ఆ పాత్ర పేరునే త‌న పేరుగా మార్చేసుకున్నారు. ఆ త‌ర్వాత చాలా కాలం క్రిత‌మే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన రాముల‌మ్మ‌... టీఆర్ ఎస్‌ లో ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగార‌నే చెప్పాలి. మెద‌క్ ఎంపీగా విజ‌యం సాధించిన ఆమె... ఆ త‌ర్వాత కేసీఆర్‌ తో విభేదాల కార‌ణంగా రాజ‌కీయంగా త‌న ప్ర‌భ‌ను మ‌స‌క‌బార్చుకున్నార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం కూడా ఆమె కాస్తంత యాక్టివ్ గానే క‌నిపిస్తున్నా... గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ లో చేరిన‌ప్ప‌టికీ రాజ‌కీయాల్లో పెద్ద‌గా రాణించే అవ‌కాశాలు మాత్రం క‌నిపించ‌డం లేదు.

అయితే ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా కూడా త‌న‌దైన ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డంలో రాముల‌మ్మ త‌న‌దైన శైలిని కొన‌సాగిస్తున్నార‌నే చెప్పాలి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ ఆమె మెద‌క్ జిల్లాలో పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప్ర‌సంగించిన సంద‌ర్భంగానూ ఇదే శైలిని కొన‌సాగించారు. స‌మావేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు దేశానికి ఎంత అవ‌స‌ర‌మ‌న్న విష‌యాన్ని కార్య‌క‌ర్త‌ల‌కు విడ‌మ‌ర‌చి చెబుతూనే... వైరి వ‌ర్గాల‌పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు తెలంగాణ సీఎం క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన రాముల‌మ్మ‌... వారిద్ద‌రినీ దొంగ‌లుగానే అభివర్ణించారు. మోదీ పెద్ద దొంగ అయితే... కేసీఆర్ చిన్న దొంగ అంటూ ఆమె సెటైర్లు వేశారు.

ఇటీవలే ముగిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తుంద‌ని దాదాపుగా అన్ని స‌ర్వేలు చెప్పినా... కేసీఆర్ ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేశార‌ని - ఆ కారణంగానే కాంగ్రెస్‌ కు అ తి త‌క్కువ స్థానాలు వ‌చ్చాయ‌ని ఆమె ఆరోపించారు. అందుకు ప్ర‌తిగా ఈ ఎన్నికల్లో టీఆర్ ఎస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ కు ఓ విజన్ ఉందని - ఓ ప్రణాళికతో పనిచేస్తారని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై ఆమె విమర్శలు చేశారు. దేశంలో జీఎస్టీ వల్ల ఎవరికి లాభం ఉందని ప్రశ్నించారు. దేశాన్ని దోచుకుంటున్న పెద్ద దొంగ మోదీ - తెలంగాణను దోచుకుంటున్న చిన్నదొంగ కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.