Begin typing your search above and press return to search.

కూట‌మికి కొర్రి పెట్టేలా రాముల‌మ్మ మాట‌లు

By:  Tupaki Desk   |   5 Nov 2018 5:26 AM GMT
కూట‌మికి కొర్రి పెట్టేలా రాముల‌మ్మ మాట‌లు
X
ఆవేశంతో ఉన్న‌ప్పుడు ఆ ఆవేశాన్ని మ‌రింత పెంచేలా మాట‌లు ఉండకూడ‌దు. కానీ.. అందుకు భిన్నంగా కొంద‌రు నేత‌లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ విజ‌య‌శాంతి మాట‌లు ఇంచుమించు ఇదే రీతిలో ఉన్నాయి. ఆమె వ్యాఖ్య‌లు కూట‌మిలో కొత్త క‌ల‌క‌లాన్ని రేపేలా మారాయి.

కేసీఆర్ ప‌ని ప‌ట్టేందుకు.. ఆయ‌న‌కు ఓట‌మి చుక్క‌లు చూపించేందుకు జ‌ట్టు క‌ట్టిన‌ట్లుగా చెబుతున్న మ‌హాకూట‌మిలో రోజుల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు జ‌రిగినా ఇప్ప‌టికి పొత్తు లెక్క‌లు ఒక కొలిక్కి రాలేదు. రోజుకో లెక్క చెప్ప‌టం.. దానికి కూట‌మి నేత‌లు కొంద‌రు అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌టం చూస్తే.. తెలుగు టీవీ సీరియ‌ల్ ను త‌ల‌పించేలా పొత్తుల చ‌ర్చ‌లు మారాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా న‌గ‌ర శివారుకు చెందిన శేరిలింగంప‌ల్లి సీటును టీడీపీకి క‌ట్ట‌బెట్ట‌నున్నార‌న్న వార్త‌లు రావ‌టంతో కూట‌మిలో కొత్త చిచ్చు రేగేలా చేసింది. శేరిలింగంప‌ల్లి సీటును టీడీపీకి ఎలా కేటాయిస్తారంటూ కాంగ్రెస్ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శేరిలింగంప‌ల్లి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న భిక్ష‌మ‌య్య‌గౌడ్ సీన్లోకి వ‌చ్చారు. కొంత‌కాలంగా కామ్ గా ఉన్న ఆయ‌న‌.. ఇప్పుడు హ‌డావుడి చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

కూట‌మి పొత్తుల్లో భాగంగా టీడీపీ సిట్టింగ్ సీట్లు ఆ పార్టీకే ఇవ్వాల‌న్న ఒప్పందం ప్రాధ‌మికంగా జ‌రిగింది. అయితే.. ఇందుకు రెండు మూడు సీట్లు (కుత్బుల్లాపూర్.. స‌న‌త్ న‌గ‌ర్‌.. ఎల్ బీ న‌గ‌ర్‌) మిన‌హాయించాల‌ని కాంగ్రెస్ కోర‌టం.. అందుకు టీడీపీ ఓకే అనిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. గ‌తంలో త‌న‌కు పార్టీ నాయ‌క‌త్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలంటూ గాంధీ భ‌వ‌న్ వ‌ర‌కూ ర్యాలీ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఈ సంద‌ర్భంగా ఒక అభిమాని త‌మ నేత‌కే సీటు ఇవ్వాలంటూ పెట్రోల్ పోసుకొని త‌గ‌ల‌బెట్టుకునే ప్ర‌య‌త్నం చేయ‌టం ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మార్చేలా చేసింది.

అయితే.. ఈ వ్య‌వ‌హారం మీద స‌మ‌గ్ర స‌మాచారం ఉందో లేదో కానీ.. రాముల‌మ్మ సీన్లోకి వ‌చ్చేశారు. కూట‌మి లెక్క‌లు ఎఫెక్ట్ అయ్యేలా వ్యాఖ్య‌లు చేశారు. కూట‌మిలో కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఆమోద‌యోగ్యంగా సీట్ల స‌ర్దుబాటు ఉండాలే త‌ప్పించి టీఆర్ ఎస్ నేత‌లు కోరుకున్న‌ట్లుగా ఉండ‌కూడ‌దంటూ కొత్త వాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

శేరిలింగంప‌ల్లి సీటుపై గాంధీభ‌వ‌న్‌లో ఆదివారం చోటు చేసుకున్న ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె ఈ వ్యాఖ్య‌లు చేయ‌టంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కాంగ్రెస్ కు న‌ష్టం వాటిల్లేలా కూట‌మిలోని పార్టీలు టీఆర్ఎస్ చెప్పిన‌ట్లు ఆడుతున్నాయ‌న్న భావ‌న క‌లిగేలా రాముల‌మ్మ మాట‌లు ఉండ‌టం గ‌మ‌నార్హం.

కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న టీడీపీ త‌న ఉనికిని చాటుకోవ‌ట‌మేకాదు.. టీఆర్ఎస్ ను ఓడించ‌టం కూడా బాధ్య‌త‌గా భావించాల‌ని విజ‌య‌శాంతి కోరుకోవ‌టం ఒక ఎత్తు అయితే.. శేరిలింగంప‌ల్లి విష‌యంలో మాత్రం ఆమె వ్యాఖ్య‌లు ఏ మాత్రం స‌రికావంటున్నారు. గెలిచే సీటును చేజార్చుకునేలా రాముల‌మ్మ వ్యాఖ్య‌లు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. తెలిసి తెలియ‌కో.. అంతంత అవ‌గాహ‌న‌తో రాముల‌మ్మ లాంటోళ్లు మాట్లాడే మాట‌ల కార‌ణంగా అన‌వ‌స‌ర‌మైన లొల్లి త‌ప్పించి ఇంకేమీ ఉండ‌దు. రాములమ్మ‌..కాస్త అవ‌గాహ‌న పెంచుకొని మాట్లాడితే బాగుంటుద‌న్న అభిప్రాయాన్ని కూట‌మి నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు.