Begin typing your search above and press return to search.

ఆమె మాట‌ల‌తో బాబు ఆశ‌లు గ‌ల్లంత‌యిన‌ట్లే!

By:  Tupaki Desk   |   30 Oct 2018 7:17 AM GMT
ఆమె మాట‌ల‌తో బాబు ఆశ‌లు గ‌ల్లంత‌యిన‌ట్లే!
X
తెలంగాణ‌లో ఉనికి కోల్పోయిన త‌న తెలుగుదేశం పార్టీకి ఒకింత ఊర‌ట‌నివ్వ‌డం - అధికార పార్టీకి అండ‌గా నిలిచి త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకోవ‌డం అనే ల‌క్ష్యంగా పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని సైతం తుంగ‌లో తొక్కి కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధ్యక్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌లు అడియాస‌లు అయ్యేలా క‌నిపిస్తున్నాయి. పొత్తు పేరుతో త‌మ సీట్ల‌కు ఎస‌రు పెడుతుండ‌టంపై ఇప్ప‌టికే కాంగ్రెస్‌ లోని కొంద‌రు సీనియ‌ర్లు భ‌గ్గుమంటుండ‌గా...తాజాగా కాంగ్రెస్ పార్టీ ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ విజ‌య‌శాంతి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని ఆమె స్ప‌ష్టం చేస్తూ...అది కూడా కొన్ని పరిమితులతోనే త‌మ పార్టీల మ‌ధ్య మిత్ర బంధం ఉంటుంద‌ని చెప్పారు. త‌ద్వారా బాబు ప్ర‌యోగాల‌కు తాము వేదిక కాద‌ల్చుకోలేద‌ని వెల్ల‌డించేశారు.

మొద‌టినుంచి కాంగ్రెస్‌-టీడీపీల పొత్తును విజ‌య‌శాంతి విబేధిస్తున్నారు. టీడీపీతో పొత్తుపై ప్ర‌జల్లో ఆమోద‌యోగ్య భావ‌న‌లు లేవ‌ని గ‌తంలో వ్యాఖ్యానించిన విజ‌య‌శాంతి - పొత్తులకు తాను వ్యతిరేకం కాదని - కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే స్థానాలు మిత్రపక్షాలు కోరవద్దని సూచించారు. కాంగ్రెస్ ప్రచార సారథి హోదాలో విజయశాంతి చేసిన ఈ కామెంట్లు ఆ స‌మ‌యంలోనే సంచ‌ల‌నం రేకెత్తించ‌గా....తాజాగా ఆమె మ‌రింత సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ప‌రిమితుల‌తోనే తాము బాబు పార్టీతో పొత్తుపెట్టుకుంటున్నామ‌ని స్పష్టం చేస్తూ...ఈ పొత్తు ఎన్నిక‌ల వ‌రకేన‌ని ఆమె స్ప‌ష్టం చేశారు కూడా. ఓ వైపు కూట‌మిలో సీట్ల స‌ర్దుబాటు మ‌రియు కాంగ్రెస్ అభ్య‌ర్థుల జాబితా ఖ‌రారు ప్ర‌క్రియ కొన‌సాగుతున్న స‌మ‌యంలో ఈ వ్యాఖ్యలు టీడీపీకి షాక్ వంటివ‌ని చెప్తున్నారు. విజ‌య‌శాంతి కామెంట్లు బాబు ఆశ‌ల‌ను అడియాస‌లు చేసేదేన‌ని అంటున్నారు. కాంగ్రెస్ సొంతగా గెలిచే అవకాశాలు లేవని - అప్పుడు తాము చక్రం తిప్పవచ్చునని టీడీపీ అధినేత భావ‌న‌. అందుకే ఇటీవ‌లి సామావేశంలో గెలిచే కీలక స్థానాలు మాత్రమే కోరుకుందాం - ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మ‌నం చ‌క్రం తిప్పుదాం అంటూ చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌కు భ‌రోసా ఇచ్చారు.

అయితే, తాజాగా ప‌రిమితులు అంటూ టీడీపీ ఆశ‌లు అడియాస‌లు చేసేలా కాంగ్రెస్ ఎత్తుగ‌డ‌లు వేస్తోంద‌ని అంటున్నారు. మ‌హాకూట‌మితో క‌లిసి సాగ‌డం వ‌ల్ల తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆ తర్వాత తమకు నామినేటెడ్ పోస్టుల్లో - ఎమ్మెల్సీ ఎన్నికల్లో పదవులు వరిస్తాయని పలువురు టీడీపీ నేత‌లు ఆశ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ...అలాంటి అవ‌కాశం లేద‌నే సిగ్న‌ల్స్‌ ను కాంగ్రెస్ ఇస్తోంద‌ని చెప్తున్నారు. వెర‌సి బాబు త‌మ‌ను అడ్డుపెట్టుకొని ప్ర‌యోజ‌నం పొందండం అయ్యే ప‌నికాద‌ని ముందు నుంచే స్ప‌ష్టం చేస్తున్న‌ట్లు వెల్ల‌డిస్తున్నారు.