Begin typing your search above and press return to search.

త‌మిళ‌నాడుపై రాముల‌మ్మ క‌న్నేసిందా?

By:  Tupaki Desk   |   9 Jun 2017 5:30 AM GMT
త‌మిళ‌నాడుపై రాముల‌మ్మ క‌న్నేసిందా?
X
అందుకే చెబుతారు రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని. తెలంగాణ రాజ‌కీయాల్లో ఏదేదో చేస్తానంటూ హ‌డావుడి చేసి.. ఆ త‌ర్వాత కామ్ గా ఉండి.. మ‌ధ్య‌లో గ‌ళం విప్పి.. మ‌ళ్లీ సైలెంట్ అయిన రాముల‌మ్మ ఉర‌ఫ్ విజ‌య‌శాంతి తాజాగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

త‌మిళ‌నాడులో సినిమాల‌కు.. రాజ‌కీయాల‌కు మ‌ధ్య‌నున్న అవినాభావ సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల్లో పెరిగిన శూన్య‌త‌న‌ను ఫిల్ చేసేందుకు ఓ ప‌క్క త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయ అరంగేట్రం చేస్తార‌న్న వాద‌న వినిపిస్తున్న వేళ‌.. అనూహ్యంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లోకి రాముల‌మ్మ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తెలంగాణ‌లో త‌న‌దైన ఇమేజ్‌ ను ప్ర‌ద‌ర్శించిన విజ‌య‌శాంతి.. ఇప్పుడు త‌మిళ‌నాడు మీద క‌న్నేయ‌టంపై రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత శ‌శిక‌ళ‌కు ఓపెన్ గా స‌పోర్ట్ చేయ‌ట‌మే కాదు.. అమ్మ ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కేన‌గ‌ర్‌ ఉప ఎన్నిక (చివ‌ర్లో వాయిదా వేయ‌టం వేరే సంగ‌తి) ప్ర‌చారానికి చిన్న‌మ్మ వ‌ర్గానికి చెందిన అభ్య‌ర్థి దిన‌క‌ర‌న్ త‌ర‌ఫున విజ‌య‌శాంతి ప్ర‌చారం చేశారు.

ఓప‌క్క చిన్న‌మ్మ మీదా.. దిన‌క‌ర‌న్ మీద త‌మిళులు తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. రాముల‌మ్మ మాత్రం వారికి త‌న పూర్తి మ‌ద్ద‌తు ప‌ల‌క‌టం విశేషం. ఇదిలా ఉండ‌గా.. అన్నాడీఎంకేకు విజ‌యశాంతిని తీసుకురావ‌టం ద్వారా కొత్త త‌ర‌హా రాజ‌కీయానికి తెర తీసేందుకు చిన్న‌మ్మ‌ను దిన‌క‌ర‌న్ ఒప్పించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే.. జైల్లో ఉన్న చిన్న‌మ్మ‌ను దిన‌క‌ర‌న్ భేటీ అయిన కాసేప‌టికే విజ‌య‌శాంతి వెళ్లి క‌ల‌వ‌టం.. ఆమెను పార్టీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానించ‌టం లాంటివి గుట్టుగా జ‌రిగిపోయిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌మిళ సినిమాల్లో త‌న‌దైన ముద్ర వేసి.. హీరోల‌కు త‌గ్గ ఇమేజ్‌ను విజ‌య‌శాంతి సొంతం చేసుకున్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజ‌య‌శాంతికానీ త‌మ త‌ర‌ఫున రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. పార్టీ మీద త‌మ ప‌ట్టును నిలుపుకోవ‌చ్చ‌న్న‌ది చిన్న‌మ్మ ఆలోచ‌న‌గా చెబుతున్నారు.

లేడీ అమితాబ్ బిరుదుతో విప‌రీత‌మైన పాపులార్టీని సంపాదించిన విజ‌య‌శాంతి సినిమాల త‌ర్వాత 1998లో బీజేపీలో చేర‌టం ద్వారా త‌న పొలిటిక‌ల్ జ‌ర్నీని షురూ చేశారు. అనంత‌రం త‌ల్లి తెలంగాణ పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసిన ఆమెకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ పోస్టును ఇచ్చి గౌర‌వించారు. కొంత‌కాలం టీఆర్ ఎస్‌ లో కీల‌క‌భూమిక పోషించిన విజ‌య‌శాంతి త‌ర్వాతి కాలంలో ఆ పార్టీ నుంచి దూరమ‌య్యారు. త‌ర్వాతి కాలంలో కాంగ్రెస్‌ లో చేరిన ఆమె.. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. త‌ర్వాతి నుంచి కామ్ గా ఉండి.. అనూహ్యంగా అన్నాడీఎంకేలో చేరేందుకు స‌న్న‌హాలు చేసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు. తెలంగాణ‌ను వ‌దిలేసి త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై విజ‌య‌శాంతి దృష్టి పెట్ట‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/