Begin typing your search above and press return to search.

మ‌నం త‌ప్పులు చేసి కేసీఆర్ ను తిడితే ఎలా?

By:  Tupaki Desk   |   20 Nov 2018 12:01 PM GMT
మ‌నం త‌ప్పులు చేసి కేసీఆర్ ను తిడితే ఎలా?
X
ఔను. మీరు స‌రిగ్గానే చ‌దివారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. త‌మ‌ పార్టీ తీరుపై ఆమె విసుగు చెందారు. తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటున్న స‌మ‌యంలో ఈ ప‌రిణామం సంచ‌ల‌నంగా మారింది. టీఆర్ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంద‌ని....కానీ అదే అవ‌కాశాన్ని టీఆర్ ఎస్ పార్టీకి ఇచ్చామ‌ని ఆమె వాపోయారు. ఇదంతా మహిళ‌ల‌కు కాంగ్రెస్ పార్టీ స‌రైన రీతిలో ప్రాధాన్యం ఇవ్వ‌క‌పోవ‌డం గురించి.

తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటోంది. పోలింగ్ తేదీ దగ్గర పడటంతో జాతీయ పార్టీలు అధిష్టాలను రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీతో ఎన్నికల ప్రచారం చేయించేందుకు షెడ్యూల్ ఖ‌రారు చేసింది. ఈ నెల 23న ఎన్నికల ప్రచారానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు వస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇరువురు నేతలకు స్వాగతం పలుకుతూ టీపీసీసీ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. పోస్టర్ లో టీపీసీసీ సీనియర్ నేతల ఫొటోలను మాత్రమే ఉంచారని - ఒక్క మహిళా నాయకురాలి ఫొటోను కూడా లేరనీ మండిపడ్డారు. ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ ఎస్ పై మనం విమర్శలు గుప్పిస్తున్నామని... మన పోస్టర్ లో ఒక్క మహిళ ఫొటో కూడా లేకపోవడంపై ప్రజలు ఆశ్చర్యపోతున్నారని విమర్శించారు. ఈ సభలో కేవలం మగవాళ్లు మాత్రమే కాకుండా, మహిళలు కూడా పాల్గొంటారు కదా అని కాంగ్రెస్ పార్టీ పెద్దలపై రాములమ్మ మండిపడ్డారు.

కాగా, విజ‌య‌శాంతి చేసిన కామెంట్లు కాంగ్రెస్ పార్టీకి స‌హాయం చేయ‌డంతో పాటుగా ఆ పార్టీని ఇబ్బంది పాలు కూడా చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తున్న నేతే కాంగ్రెస్ త‌ప్పిదాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం పైగా అధికార పార్టీకి అవ‌కాశం ఇచ్చేలా విమ‌ర్శ‌లు చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో మ‌హిళ‌ల‌కు ద‌క్కుతున్న `గౌర‌వానికి` నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.