Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ పై క‌త్తి దూసిన రాముల‌మ్మ‌!

By:  Tupaki Desk   |   4 Oct 2018 5:11 PM GMT
టీఆర్ ఎస్ పై క‌త్తి దూసిన రాముల‌మ్మ‌!
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా మోగ‌డంతో అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ప్ర‌చారం పై - అభ్య‌ర్థుల ఎంపిక‌పై దృష్టి సారించాయి. ఇప్ప‌టికే అధికార టీఆర్ ఎస్ ప్ర‌చారానికి శ్రీ‌కారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. 105మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంతో గులాబీ నేత‌లు...త‌మ త‌మ నియోజ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం మొద‌లు పెట్టారు. ఇక‌ తాజాగా - మ‌హాకూట‌మి ర‌థసార‌ధి అయిన కాంగ్రెస్ నేడు త‌మ ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప‌చ్చ‌జెండా ఊపింది. ఆలంపూర్‌ లోని జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంత‌రం కాంగ్రెస్ నేత‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - జానారెడ్డి - భట్టి విక్రమార్క - సంపత్‌ - డీకే అరుణ‌ - విజ‌య‌శాంతిలు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఆలంపూర్ లో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్‌ నేతలు ఎన్నిక‌ల న‌గారా మోగించారు. సినిమాలో రాములమ్మ ప‌డిన‌న్ని కష్టాలు నేడు తెలంగాణ ప్రజలు పడుతున్నారని విజ‌య‌శాంతి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దొరలపాలన - దోపిడీ పాలన మనకు వద్దని విజయశాంతి అన్నారు.

బ్యాండ్‌ వాయించిన ఉత్త‌మ్ ఆక‌ట్టుకున్నారు. శంఖం పూరించిన భ‌ట్టి విక్రమార్క ఎన్నిక‌ల స‌మ‌రానికి సిద్ధ‌మ‌న్నారు. సీనియ‌ర నేత జానా రెడ్డి త‌ల‌పాగా చుట్టి తల్వార్ దూసి ఎన్నిక‌ల‌కు సై అన్నారు. తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి కూడా టీఆర్ ఎస్ పై క‌త్తి దూసి ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో దిగేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సీనియర్‌ నేత డీకే అరుణ కూడా తల్వార్ తిప్పుతూ ఎన్నికల ప్రచారభేరిని ప్రారంభించారు. కేసీఆర్‌ కు మరో ఐదేళ్లు అవకాశమిస్తే తెలంగాణ‌ను దోచుకుంటారని విజ‌యశాంతి మండిప‌డ్డారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు. కేసీఆర్‌కు మ‌రోసారి సీఎం అయితే మూడేళ్లకే పారిపోతాడని విజయశాంతి ఎద్దేవా చేశారు. గ‌తంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న కేసీఆర్ నేడు మ‌హాకూట‌మిని విమ‌ర్శించ‌డం హాస్యాస్ప‌ద‌మ‌ని జానారెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అబద్ధపు కూతలు కూస్తున్నారని మండిప‌డ్డారు.