Begin typing your search above and press return to search.

రాముల‌మ్మ ఆశ అంతా కోర్టుల మీదేనేన‌ట‌!

By:  Tupaki Desk   |   30 Jun 2019 9:36 AM GMT
రాముల‌మ్మ ఆశ అంతా కోర్టుల మీదేనేన‌ట‌!
X
ప్ర‌భుత్వం ప‌ని చేయ‌కున్నా.. త‌ప్పుడు ప‌ని చేస్తున్నా.. అలాంటి వాటిపై ప్ర‌జ‌ల్లో చైత‌న్యం తీసుకొచ్చి పోరాటం చేయాలి. అయితే ఆ ప‌ని చేయ‌ని తెలంగాణ రాముల‌మ్మ ఈ మ‌ధ్య‌న బ‌య‌ట‌కు రాకుండా ఫేస్ బుక్ లో అదే ప‌నిగా పోస్టులు పెట్టేయ‌టం ఎక్కువైంది. రెండు.. మూడు రోజుల‌కోసారి రాత్రి వేళ‌లో ఆమె పెట్టే పోస్టులు అధికార‌ప‌క్షం తీరును త‌ప్పు ప‌ట్టేలా ఉంటున్నాయి.

విప‌క్ష నేత‌గా ప్ర‌భుత్వాన్ని త‌ప్పు ప‌ట్ట‌టాన్ని అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. ఆస‌క్తిక‌ర‌ విష‌యం ఏమంటే.. ప్ర‌జ‌ల్లో మ‌మేకం కాకుండా ఉత్త‌గా ఫేస్ బుక్ లో పోస్టులు పెడితే స‌రిపోతుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. కేసీఆర్ స‌ర్కారు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. నియంతృత్వంతో ఆయ‌న తీసుకుంటున్న నిర్ణ‌యాల‌కు బ్రేకులు ప‌డేది ఎప్పుడ‌న్న ప్ర‌శ్న‌ను ఆమె సంధిస్తున్నారు.

కొత్త అసెంబ్లీ భ‌వ‌న నిర్మాణం మీద కోర్టు అడిగిన ప్ర‌శ్న‌ల‌పై ఆమె స్పందిస్తూ.. గ‌తంలో తాము ఇలాంటి ప్ర‌శ్న‌లే అడిగితే.. ప్ర‌శ్నించే అర్హ‌త లేదంటూ టీఆర్ ఎస్ నేత‌లు విరుచుకుప‌డ్డార‌ని.. ఇప్పుడు కోర్టులో న్యాయ‌మూర్తి అడిగితే స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌న్నారు.

తమ ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నా.. అడిగే నాథుడు లేడన్న రీతిలో టీఆర్ ఎస్ పాల‌కులు ఎన్ని త‌ప్పులు చేస్తున్నార‌న్న అనుమానం సామాన్య ప్ర‌జ‌ల్లో క‌లుగుతుంద‌న్న ఆయ‌న‌.. హైకోర్టు జోక్యంతో అయినా కేసీఆర్ స‌ర్కారు దూకుడుకు క‌ళ్లెం ప‌డుతుంద‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు. కోర్టులు త‌మ ప‌ని తాము చేస్తున్నాయి. కానీ.. విప‌క్ష నేత‌గా నిర్వ‌ర్తించాల్సిన ధ‌ర్మాన్ని రాముల‌మ్మ అండ్ కో చేయ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంతేకాదు.. ఫేస్ బుక్ లో విజ‌య‌శాంతి పోస్టు చూస్తే.. ఎన్నో త‌ప్పులు క‌నిపిస్తాయి. ముందు.. అధికార‌ప‌క్ష అధినేత‌ను వేలెత్తి చూపించే ముందు..తాను పెట్టే పోస్టు మీద మ‌రింత దృష్టి పెడితే బాగుంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇంత‌కీ.. విజ‌య‌శాంతి పెట్టిన పోస్టును య‌థాత‌ధంగా చూస్తే..

అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందనే నియంతృత్వ ధోరణితో వ్యవవహరించే ప్రభుత్వాలన్నిటికి ఎక్కడో ఒకచోట స్పీడ్ బ్రేక్ పడుతుంది. టీఆరెస్ ప్రభుత్వానికి ఇప్పటికే పలుసార్లు స్పీడ్ బ్రేక్ లు పడినా అధికార పార్టీ అధినేత వైఖరి మాత్రం మారిన దాఖలాలు కనిపించడం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ కొత్తగా నిర్మించ తలబెట్టన సచివాలయం, అసెంబ్లీ భవనాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పేర్కొనవచ్చు.

పాత అసెంబ్లీ భవనాన్ని ఎందుకు కూలుస్తున్నారని (అసెంబ్లీ భ‌వ‌నాన్నికూల్చ‌టం లేదు. పాత భ‌వ‌నాన్ని అలా వ‌దిలేసి.. ఎర్ర మంజిల్ భ‌వ‌నాన్ని కూల్చేసి కొత్త అసెంబ్లీ క‌డుతున్నారు. ఈ విష‌యాన్ని రాముల‌మ్మ ఇలా చెప్పుకొచ్చారు) ప్రతిపక్షాలు అడిగితే మీకు అడిగే అర్హత లేదని టీఆర్ ఎస్ అధిష్టానం మొండి వైఖరిని అనుసరించింది. ఇప్పడు హైకోర్టు అదే ప్రశ్న అడిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేక పోయింది. అంతేకాదు కొత్తగా కట్టబోతున్న సచివాలయం, అసెంబ్లీలకు సంబంధించిన ప్లాన్ లను (అసెంబ్లీ ప్లాన్ ను మాత్ర‌మే కోర్టు అడిగింది. ఆ విష‌యాన్ని విజ‌య‌శాంతి మిస్ అయిన‌ట్లున్నారు) అడిగితే...ఎలాంటి ప్లాన్ లు ఇంకా నిర్ధారణ కాలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టులో చెప్పడం చాలా విడ్డూరం.

దీన్నిబట్టి ఎలాంటి ప్రణాళిక లేకుండా, ఇష్టానుసారం తమను అడిగే నాధుడు లేడన్న ధైర్యంతో టీఆర్ఎస్ పాలకులు ఎన్ని తప్పులు చేస్తున్నారో అన్న అనుమానం సామాన్యులకు కలుగుతుంది. హైకోర్టు జోక్యంతోనైనా టీఆర్ఎస్ ప్రభుత్వ దూకుడుకు కళ్లెం పడుతుందేమో చూడాలి.