Begin typing your search above and press return to search.

ఏంది రాముల‌మ్మ‌..అర్థ‌రాత్రి పూట ఈ పోస్టులు?

By:  Tupaki Desk   |   19 Jun 2019 4:40 AM GMT
ఏంది రాముల‌మ్మ‌..అర్థ‌రాత్రి పూట ఈ పోస్టులు?
X
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ క‌మ్ రాముల‌మ్మ విజ‌య‌శాంతి వ్య‌వ‌హారం భ‌లే సిత్రంగా ఉందంటున్నారు. రాజ‌కీయ నాయ‌కుడు ఎవ‌రైనా స‌రే.. తాను మాట్లాడే మాట‌లు.. చేసే వ్యాఖ్య‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌న్న ఆలోచ‌న‌తోనే మాట్లాడుతుంటారు. ఈ సంద‌ర్భంగా స‌మ‌యం.. సంద‌ర్భం లాంటివి చూసుకొని మాట్లాడ‌తారు.

కొంద‌రు ముఖ్య‌నేత‌లు అయితే..తాము మాట్లాడాల్సిన విష‌యానికి సంబంధించి వేదిక‌.. టైం చూసుకొని మాట్లాడ‌తారు. త‌మ మాట‌ల‌కు త‌గ్గ ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని తెలిసిన‌ప్పుడు ఒక రోజు ఆగి మాట్లాడ‌తారేకానీ.. తొంద‌ర‌ప‌డిపోవ‌టం క‌నిపించ‌దు. ఇలాంటివేమీ విజ‌య‌శాంతికి అస్స‌లు ప‌ట్ట‌వన్న మాట వినిపిస్తోంది. మౌనంగా ఉంటూ.. ఉన్న‌ట్లుండి సోష‌ల్ మీడియాలో.. అందునా ఫేస్ బుక్ అకౌంట్లో రాముల‌మ్మ పెట్టే పోస్టులు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. టీఆర్ ఎస్ అధినేత‌ను ఉద్దేశించి ఆమె ఘాటు విమ‌ర్శ‌లు చేస్తుంటారు.

ప్రెస్ మీట్లకు దూరంగా ఉండే రాముల‌మ్మ‌.. ఉన్న‌ట్లుండి ఫేస్ బుక్ లో తాను చెప్పాల్సింది చెప్పేస్తుంటారు. సోష‌ల్ మీడియా వ‌చ్చాక.. ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ పెట్టే ప‌నిని చాలామంది త‌గ్గించుకున్నారు. సోష‌ల్ మీడియాలో తాము చెప్పాల్సింది చెప్పేయ‌టం ద్వారా.. తాము ఏం చెప్పాలో అది మాత్ర‌మే చెప్ప‌టం.. త‌మ‌ను అన‌వ‌స‌రంగా ఇరికించే అంశాల‌కు దూరంగా ఉండే అవ‌కాశం ఉండ‌టంతో పాటు.. ప్రెస్ మీట్ అంటే గ‌తంలో మాదిరి సింఫుల్ వ్య‌వ‌హారం కాదు. కాస్తంత ఖ‌ర్చుతో కూడుకున్న‌దిగా మారిపోవ‌టంతో ప‌లువురు నేత‌లు ప్రెస్ మీట్ ను ఎవాయిడ్ చేస్తున్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్పుడు అలాంటి జాబితాలో చేరారు విజ‌య‌శాంతి. ప్రెస్ మీట్ల‌ను పెద్ద‌గా పెట్ట‌ని విజ‌య‌శాంతి తాను చెప్పాల‌నుకున్న విష‌యాల మీద సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. కాకుంటే.. ఆమెతో వ‌చ్చిన చిక్కేమంటే.. తాను పెట్టే కీల‌క పోస్టులు రాత్రి ప‌ద‌కొండు మొద‌లు అర్థరాత్రి పన్నెండు గంట‌ల వేళ‌లో పెడుతున్నారు. దీంతో.. ఆమె వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాకే ప‌రిమిత‌మ‌వుతున్నాయి. మొయిన్ స్ట్రీమ్ మీడియా క‌వ‌ర్ చేయ‌లేని ప‌రిస్థితి.

ఒక‌వేళ ప‌క్క‌రోజు క‌వ‌ర్ చేద్దామంటే అప్ప‌టికే ఒక‌టిన్న‌ర రోజు ఆల‌స్యం కావ‌టం.. త‌ర్వాతి రోజు రెండో రోజుగా మారిపోవ‌టంతో ఆమె మెసేజ్ ల‌ను ప‌త్రిక‌ల్లో వార్త‌ల రూపంలో పెద్ద‌గా రాని ప‌రిస్థితి. మైలేజీ వ‌చ్చే అంశాల్ని పోస్టులుగా పెడుతున్న రాముల‌మ్మ‌.. స‌మ‌య‌పాల‌న విష‌యంలో ఆమె అనుస‌రిస్తున్న ధోర‌ణి ఆమెకు వ‌చ్చే మైలేజీని దెబ్బ తీస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.