Begin typing your search above and press return to search.

పీకేకు రాముల‌మ్మ కితాబు!...కార‌ణ‌మేంటంటే?

By:  Tupaki Desk   |   18 March 2019 4:15 AM GMT
పీకేకు రాముల‌మ్మ కితాబు!...కార‌ణ‌మేంటంటే?
X
శ‌త్రువుకు శ‌త్రువు... మిత్రుడే. ఇత‌ర రంగాల విష‌యంలో ఈ మాట ఎలా ఉన్నా... రాజకీయ రంగంలో మాత్రం ఈ మాట అక్ష‌రాల నిజ‌మేన‌ని చెప్పాలి. సీమాంధ్రులంటే.... అంతెత్తున ఎగిరిప‌డ్డ తెలంగాణ రాజ‌కీయ నేత‌లు... ఇప్పుడు మాట మార్చేశారు. తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ ఎస్‌ - దాని అధినేత‌ - సీఎం కేసీఆర్‌ కు ఇప్పుడక్క‌డ దాదాపుగా అన్ని పార్టీలు శత్రువులే. ఒక్క మ‌జ్లిస్ త‌ప్పించి మిలిగిన తెలంగాణ పార్టీల‌న్నీ కూడా కేసీఆర్ నియంత‌లా మారిపోయార‌ని ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీ ఎన్నిక‌ల్లో ఓ మోస్త‌రు ప్ర‌భావం చూపే దిశ‌గా సాగుతున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన... తెలంగాణ పార్టీల‌కు ప్ర‌త్యేకించి కేసీఆర్ అంటే పీక‌ల్దాకా కోపం పెంచుకున్న నేత‌ల‌కు ఇష్ట‌మైన పార్టీగా మారిపోయింది. ఎందుకంటే.. కేసీఆర్‌ ను త‌న‌దైన శైలిలో తుల‌నాడ‌టంతో పాటుగా సీమాంధ్ర రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోరాదంటూ ప‌వ‌న్ కాస్తంత గ‌ట్టిగానే చెప్పేశారు. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో మాట్లాడిన ప‌వ‌న్‌... తెలంగాణ వ‌ర‌కే ప‌రిమిత‌మైన కేసీఆర్ సీమాంధ్రుల గురించి ఎలా మాట్లాడ‌తార‌ని - అలా మాట్లాడి సీమాంధ్ర రాజ‌కీయాల్లో జోక్యం చేసుకోవ‌డం ప‌ద్ద‌తి కాద‌ని కూడా ప‌వ‌న్ వార్నింగ్ లాంటి వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు తెలంగాణ‌లో పెద్ద ఎత్తున చ‌ర్చ‌కు తెర తీశాయ‌నే చెప్పాలి. కేసీఆర్ అంటే ప‌డ‌ని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్‌ - మాజీ ఎంపీ - రాముల‌మ్మ‌గా అంతా పిలుచుకునే విజ‌య‌శాంతి... పీకే వ్యాఖ్య‌ల‌పై హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డంతో పాటుగా పీకే సరైన బాట‌లో న‌డుస్తున్నారంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ మేర‌కు నిన్న విడుద‌ల చేసిన ఓ ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో విజ‌య‌శాంతి... పీకేను మెచ్చుకుంటూ కామెంట్స్ చేశారు. ఈ ప్ర‌క‌ట‌న‌లో ఆమె ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... *నెల రోజుల క్రితం రాజ్‌ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను కలిసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనతో రహస్య మంతనాలు జరిపారని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించినట్లు కూడా మీడియాలో ప్రచారం జరిగింది. ఒకవేళ ఈ వార్తల్లో నిజం ఉంటే - కేసీఆర్ వేసే ఫెడరల్ ఫ్రంట్ ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడరనే నేను అదే రోజు కామెంట్ చేశాను. దాన్ని మీడియా బాగా ఫోకస్ చేసింది. నేను ఊహించిన విధంగానే పవన్ కళ్యాణ్ కేసీఆర్ ఉచ్చులో పడకుండా ఆయన అసలు స్వరూపాన్ని బయటపెట్టి, తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు* అని ఆమె పీకేపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

అంత‌టితో ఆగ‌ని ఆమె... *ప‌వ‌న్‌ చేసిన కామెంట్స్ కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయంగా భావించకుండా - ఇది ఆంధ్రుల మనోవేదనగా పరిగణించాలి. ఇంతకాలం కేసీఆర్ నియంతృత్వ పోకడను నిలదీసేందుకు సీమాంధ్రుల్లో సరైన నేత లేరనే వాదన వినిపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం అందరి అంతరంగాల్ని ఆవిష్కరించే విధంగా సాగింది. సీమాంధ్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికతో ప్రతీ ఒక్క ఆంధ్రుడు ఏకీభవిస్తాడు. ఏపీ ప్రజల పాలిట విలన్‌ గా మారిన బీజేపీకి బినామీగా ఏపీ రాజకీయాల్లో ప్రవేశించాలనుకుంటున్న కేసీఆర్‌ ను అక్కడి ప్రజలు అంగీకరించే పరిస్ధితి లేదు. కేంద్రంలో రాహూల్ గాంధీ నేతృత్వంలో యూపీయే ప్రభుత్వం రావాలి - ఏపీకి ప్రత్యేక హోదా సాధించుకోవాలని ఇప్పటికే సీమాంధ్ర ప్రజలు మానసికంగా సిద్ధమైపోయారు. వారిని తప్పుదోవ పట్టించడానికి మోదీగారితో కలిసి కేసీఆర్ గారు ఎన్ని జిమ్మిక్కులు చేసిన అవి ఏవీ ఫలించవు* పీకేను ఆకాశానికెత్తేసి - కేసీఆర్‌ పై త‌న‌దైన శైలి వ్యాఖ్య‌లు చేశారు.