Begin typing your search above and press return to search.

బీజేపీలోకి రాములమ్మ..దసరా రోజే ముహూర్తం!

By:  Tupaki Desk   |   27 Sep 2019 3:52 PM GMT
బీజేపీలోకి రాములమ్మ..దసరా రోజే ముహూర్తం!
X
తెలుగు నేల రాజకీయాల్లో రాములమ్మగా పేరు సంపాదించిన ప్రముఖ సినీ నటి - ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఇప్పుడు బీజేపీలోకి చేరిపోయేందుకు సిద్ధమయ్యారు. అంతేకాదండోయ్... దసరా రోజుననే ఆమె కాషాయ కండువా కప్పుకునేందుకు కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నట్లుగా వినిస్తున్న వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తొలుత టీఆర్ ఎస్ లో ఆ తర్వాత కాంగ్రెస్ లో తనదైన శైలి నేతగా ఎదిగిన విజయశాంతి... టీఆర్ ఎస్ లో ఉండగా మెదక్ ఎంపీగా కూడా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కేసీఆర్ స్వయంగా చెల్లెమ్మగా పిలుచుకునే విజయశాంతి... ఆ తర్వాతి పరిణామాల్లో టీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేసి... కేసీఆర్ కు షాకిచ్చారు.

తాజాగా తెలుగు నేలలో ప్రత్యేకించి తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకున్న రాములమ్మ... కాంగ్రెస్ పార్టీలోనే ఇంకా కొనసాగితే... తనకు భవిష్యత్తు లేదన్న భావనకు వచ్చారట. ఇదే విషయాన్ని గుర్తించిన కమలనాథులు కూడా ఆమెతో భేటీ అయ్యారట. అటు టీఆర్ ఎస్ తో పాటు ఇటు కాంగ్రెస్ లోనూ ఇమడలేకపోతున్న రాములమ్మ... బీజేపీలోకి చేరితే మంచి గుర్తింపు ఇస్తామని కూడా కమలనాథులు చెప్పారట. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గానే కాకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాల్లో రాణించిన విజయశాంతి... రాజకీయాల్లో మాత్రం అంతగా రాణించలేదనే చెప్పాలి. ఆ లోటును కూడా తాము తీరుస్తామని - తమ పార్టీలో చేరాలని కూడా బీజేపీ నేతలు రాములమ్మతో రాయబారాలు నెరిపారట.

ఇదిలా ఉంటే... తెలంగాణలో నానాటికి బలహీనంగా మారుతున్న కాంగ్రెస్ పార్టీలో ఉండలేక - కేసీఆర్ తో మనస్పర్ధల కారణంగా టీఆర్ ఎస్ లో చేరలేక రాములమ్మ డైలమాలో పడిపోయారట. ఇదే అదనుగా ఎంట్రీ ఇచ్చిన కమలనాథులు... బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానించడంతో రాములమ్మ ఏమాత్రం ఆలోచించకుండానే ఓకే చెప్పేశారట. ఇప్పటికిప్పుడు రాములమ్మను తమ పార్టీలోకి చేర్చుకుని ఇటు హుజూర్ నగర్ బైపోల్స్ - అటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సేవలను వినియోగించుకునేందుకు కమలనాథులు ప్లాన్ వేశారట. ఈ ప్లాన్ విన్న రాములమ్మ... ఎలాగూ బీజేపీలోకి చేరిపోయేందుకు సిద్ధమన తర్వాత ఇంక లేటెందుకు - దసరా రోజునే బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. ఇదే జరిగితే... రాములమ్మ బీజేపీలో చేరితే.... ఇటు కాంగ్రెస్ తో పాటు అటు టీఆర్ ఎస్ కు కూడా షాకేనని చెప్పక తప్పదు.