Begin typing your search above and press return to search.

కేసీఆర్ పాల‌న అంచ‌నాకు టైం కావాలంట‌

By:  Tupaki Desk   |   24 July 2015 9:35 AM GMT
కేసీఆర్ పాల‌న అంచ‌నాకు టైం కావాలంట‌
X
కొద్దికాలంగా ఎలాంటి మాట‌లు లేకుండా కామ్‌గా ఉన్న రాముల‌మ్మ అలియాస్ విజ‌య‌శాంతి తాజాగా గొంతు విప్పారు. సార్వత్రిక ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం తర్వాత ఆమె మాట్లాడ‌కుండా మౌనంగా ఉండ‌టం తెలిసిందే.
సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు టీఆర్ ఎస్ లో ఉంటూ ప్ర‌ముఖ నేత‌గా ఒక వెలుగు వెలిగిన విజ‌య‌శాంతి త‌ర్వాత‌.. కేసీఆర్‌తో ప‌డ‌క త‌న దారిన తాను వ‌చ్చి కాంగ్రెస్‌లో చేర‌టం తెలిసిందే. తాజాగా.. మ‌రోమారు విజ‌య‌శాంతి కారు ఎక్క‌నున్నార‌న్న మాట వినిపిస్తున్న నేప‌థ్యంలో ఆమె స్పందిస్తూ.. తాను కాంగ్రెస్ లోనే కొన‌సాగుతాన‌ని వ్యాఖ్యానించారు.

టీఆర్ ఎస్ పాల‌న మీద ఇష్టారాజ్యంగా వ్యాఖ్య‌లు చేసే నేత‌ల‌కు భిన్నంగా విజ‌య‌శాంతి స్పందించారు. టీఆర్ ఎస్ స‌ర్కారు పాల‌న మీద ఒక అంచ‌నాకు మ‌రింత స‌మ‌యం కావాల‌ని.. ప్ర‌జ‌లు న‌మ్మి అధికారాన్ని క‌ట్ట‌బెట్టిన నేపథ్యంలో అంచ‌నాకు స‌మ‌యం కావాల‌ని వ్యాఖ్య చేయ‌టం విశేషం. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో అవ‌కాశం చిక్కింది మొద‌లు చీల్చి.. చెండాలాల‌న్న తీరులో వ్య‌వ‌హ‌రించే నేత‌ల‌కు భిన్నంగా విజ‌య‌శాంతి సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రించారా? లేక వ్యూహాత్మ‌కంగానే ఆమె ఈ వ్యాఖ్య చేశారా? అన్న‌ది తేలాల్సి ఉంది.

తెలంగాణ‌ను పాలించే విష‌యంలో కేసీఆర్ విఫ‌ల‌మ‌య్యార‌ని ప్ర‌జ‌లు అనుకునే వ‌ర‌కూ విమ‌ర్శ‌లు చేయ‌టానికి వెయిట్ చేయాలంటూ విజ‌య‌శాంతి కాస్తంత రాజ‌కీయంగా మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఈ లోగుట్టు మాట‌ల అర్థ‌మేంది రాముల‌మ్మ‌..?