Begin typing your search above and press return to search.

కేసీఆర్ బ‌డ్జెట్‌ పై రాముల‌మ్మ సెటైర్లు

By:  Tupaki Desk   |   9 Sep 2019 3:28 PM GMT
కేసీఆర్ బ‌డ్జెట్‌ పై రాముల‌మ్మ సెటైర్లు
X
తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దేశ - రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై - బడ్జెట్ పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సెటైర్లు వేశారు. చంద్రయాన్-2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో గానీ - కేసీఆర్.. తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదని ఎద్దేవా చేశారు.

గత సంవత్సరం లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అక్షరాస్యత కల్పించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందని అన్నారు. ఇక పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టిఆర్ ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని - విష జ్వరాలు విజృంభిస్తున్నా ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం విచారకరమని చెప్పారు. చివరకు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు.

పైగా గత బడ్జెట్ లో విద్య - వైద్య - వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం.. ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు. అసలు ఈ కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయి? అనే ప్రశ్నకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఇక గత బడ్జెట్ లెక్కలు తేలకముందే.. ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారని విమర్శించారు. అయితే కేసీఆర్ లెక్క - పద్దుల విషయం ఏమోగానీ.. గత బడ్జెట్‌లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని అన్నారు. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలని సెటైర్ వేశారు.