Begin typing your search above and press return to search.

ట్రాఫిక్ తో బెజ‌వాడ వాసుల బెంబేలు!

By:  Tupaki Desk   |   8 July 2017 12:29 PM GMT
ట్రాఫిక్ తో బెజ‌వాడ వాసుల బెంబేలు!
X
విజ‌య‌వాడ‌లోని బెంజి స‌ర్కిల్ లో ట్రాఫిక్ క‌ష్టాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీయే) పరిధిలో ఉన్న విజయవాడ నగర వాసులంతా ప్రతి రోజూ 'బెంజి' సర్కిల్' మీదుగా తమ వృత్తి, వ్యాపారాల నిర్వ‌హ‌ణ‌కు వెళుతుంటారు.

గ‌తంలో బెంజి సర్కిల్‌ మీదుగా దూసుకెళ్లే వారు కూడా ఇప్పుడు కనీసం పావుగంటపాటు ఈ జంక్షన్‌ లో వేచి ఉండాల్సిన ప‌రిస్థితి. బెజవాడ వాసులు ఇప్పుడు ఆ పేరు పలకాలంటేనే బెంబేలెత్తుతున్నారు.

ప్రముఖ వాణిజ్య నగరం విజయవాడలో రహదారులు ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర రాజధాని ఇక్కడికి తరలి రావడంతో నగరంపై వాహనాల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగిపోయింది.ఉద్యోగ - వ్యాపార నిమిత్తం వ‌చ్చేవారు - కోస్తా - సీమ జిల్లాల నుంచి వ్యాపారుల తాకిడి కూడా బెజ‌వాడ‌లో ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికశాతం విజయవాడలోనే ఏర్పాటు చేయడంతో ఆ ర‌ద్దీ మ‌రింత పెరిగింది.

పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. ఎలాంటి ప్రత్యామ్నాయాలు లేకుండా విస్తరణ పనులు చేపట్టడంతో ట్రాఫిక్‌ వ్యవస్థ గాడితప్పింది. ఫలితంగా నగరవాసులు నిత్యం నరకాన్ని చూస్తున్నారు. హైదరాబాద్‌ - విజయవాడ కోల్‌కతా - చెన్నై, బందరు రోడ్డు పైనే 90 శాతం వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఇప్పుడు ఇవి ఇరుకిరుగ్గా తయారయ్యాయి. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రహదారి విస్తరణ పనులు ఏడాదికిపైగా సాగుతున్నాయి.

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందాన ఇటీవలే బెంజి సర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులు ప్రారంభమయ్యాయి. బెంజి సర్కిల్‌ నుంచి రామవరప్పాడు వరకు ఈ పనులు జరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తికాక హైదరాబాద్‌ నుంచి బెజవాడ సిటీకి వచ్చేవారికే కాదు ఇబ్రహీపట్నం, భవానీపురంలో ఉండే వారికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలను చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌, మరికొన్ని వాహనాలను రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర నగరం చుట్టూ తిరిగి నగరంలోకి ప్రవేశించాల్సిన దుస్థితి.

దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తికాక హైదరాబాద్‌ నుంచి బెజవాడ సిటీకి వచ్చేవారికే కాదు ఇబ్రహీపట్నం, భవానీపురంలో ఉండే వారికి కూడా చుక్కలు కనిపిస్తున్నాయి. కొన్ని వాహనాలను చనమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌, మరికొన్ని వాహనాలను రామవరప్పాడు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి మళ్లిస్తున్నారు. చనుమోలు వెంకట్రావు ఫ్లైవోర్‌ వద్ద తరచూ గంటలకొద్దీ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను చిట్టినగర్‌, సొరంగం మార్గం వైపు మళ్లించడంతో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు నిత్యకృత్యం అయ్యాయి.

కృష్ణలంక వద్ద పుష్కరాలకు ముందు చేపట్టిన హైదరాబాద్‌ రహదారిపై సబ్‌వే నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారిపై కృష్ణలంక వద్ద కృష్ణా నదిపై వారధి నిర్మించినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. వారధికి అవతలి వైపున ఆరు లేన్ల రహదారి నిర్మించినా, వారధిని మాత్రం రెండు లేన్లల్లో నిర్మించారు. దీంతో ఇక్కడ తరచూ పెద్దఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోతోంది. పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను నుంచి గుంటూరు జిల్లాలోని ఖాజ గ్రామం వరకు బైపాస్‌ రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయవాడకు భారీ వాహనాల తాకిడి ఉండదు.

బెజవాడలో సిగ్నలింగ్‌ వ్యవస్థ దారుణంగా ఉంది. విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని కూడళ్లలో ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు ఉంటేనే పరిస్థితి అదుపులో ఉంటుంది. విజయవాడలో అన్ని పాఠశాలలు, కళాశాలలు ఒకే సమయానికి ప్రారంభించి, ఒకేసారి వదులుతున్నారు. విద్యాసంస్థలను వదిలే విషయంలో ఒక్కో సంస్థ ఒక్కో సమయాన్ని పాటించేలా చూస్తే ట్రాఫిక్‌ సమస్యకు కొంత వరకు చెక్‌ పెట్టవచ్చు. బీఆర్టీఎస్‌... బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టం. ప్రయాణికులు దిగే చోట తప్ప, ఇంకెక్కడా బస్సు ఆగకూడదు. నిమిషాల వ్యవధిలో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేపట్టారు. సరైన ప్రణాళిక లేక దీని లక్ష్యం నీరు గారిపోయింది.