Begin typing your search above and press return to search.

బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో తాంత్రిక పూజ‌లా?

By:  Tupaki Desk   |   2 Jan 2018 7:52 AM GMT
బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో తాంత్రిక పూజ‌లా?
X
కోట్లాది మంది భ‌క్తులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో కొలిచే బెజ‌వాడ దుర్గ‌మ్మ గుడిలో చోటు చేసుకున్న ఉదంతం ఇప్పుడు తీవ్ర సంచ‌ల‌నంగా మారింది. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా.. అన‌ధికారికంగా అమ్మ‌వారి గ‌ర్భ‌గుడిలో తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌టం ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అర్థ‌రాత్రి వేళ‌.. అన‌ధికారికంగా.. అంత‌రాల‌యం త‌లుపులు తెరిచి.. ర‌హ‌స్యంగా తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌టం.. ఇందుకు ఒక అధికారి బ‌రి తెగింపు కార‌ణ‌మ‌న్న విమ‌ర్శ బ‌లంగా వినిపిస్తోంది.

కోట్లాది మంది భ‌క్తుల సెంటిమెంట్ల‌తో ఆడుకుంటున్న ఇలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉన్నా.. ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి వ‌చ్చినా.. ప్ర‌భుత్వం నుంచి వ‌చ్చిన స్పంద‌న అర‌కొర‌గానే ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాంత్రిక పూజ‌లు ఏం చేశారు? ఎందుకు చేశారు? అలా ఎందుకు చేయ‌కూడ‌దు? అన్న విష‌యాల్లోకి వెళితే..

ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన అమ్మ‌వారు శాంత స్వ‌రూపం. అలా కొలిచేలా ఆదిశంక‌రాచార్యుల వారు అమ్మ‌వారిని ల‌లితా రూపాన్ని తీసుకొచ్చేలా చేశారు. ఆదిశంకరాచార్యుల వారి సూచ‌న త‌ర్వాత గుడిలో సాత్విక పూజ‌లే జ‌రుగుతున్నాయి. వంద‌ల ఏళ్లుగా సాగుతున్న క్ర‌మాన్ని ఉల్లంఘిస్తూ తాజాగా తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌టం షాకింగ్ గా మారింది. తాంత్రిక పూజ‌ల కార‌ణంగా అమ్మ‌వారికి ఉగ్ర‌రూపం వ‌చ్చేస్తుంది. ఇది స‌రైన ప‌ద్ధ‌తి కాద‌న్న‌ది ప‌లువురి అభిప్రాయం.

అయితే.. ఇటీవ‌ల ఒక అధికారి త‌న‌కున్న స‌మ‌స్య‌ల్ని ఒక ఆర్చ‌కుడికి చెబితే.. భైర‌వీ పూజ చేయిస్తే అద‌న‌పు శ‌క్తులు వ‌స్తాయ‌ని.. క‌ష్టాలు తొలిగిపోతాయ‌ని స‌ల‌హా ఇచ్చారు. దీంతో.. అందుకు ఓకే అన్న అధికారి గుట్టుగా.. చేయాల్సిన ప‌ని చేసేశారు.

త‌మిళ‌నాడుకు చెందిన న‌లుగురు తాంత్రికుల్ని.. అందులోనూ భైర‌వీ పూజ నిర్వ‌హ‌ణ‌లో నిష్ణాతులైన తాంత్రికుల్ని విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చారు. డిసెంబ‌రు 26 రాత్రి తొమ్మిది గంట‌ల స‌మ‌యంలో గట్టు వెనుక ఉండే ఆల‌య ఆర్చ‌కుడి ఇంటికి వెళ్లిన కీల‌క అధికారి.. భైర‌వి పూజ ఎలా పూర్తి చేయాల‌న్న దానిపై చ‌ర్చించుకున్నారు.

అనంత‌రం అధికారి వెళ్లిపోయిన‌ట్లుగా చెబుతున్నారు. త‌మిళ‌నాడు నుంచి ర‌ప్పించిన న‌లుగురు తాంత్రికులతోపాటు.. అమ్మ‌వారి ఆల‌యంలో పూజ‌లు చేసే తండ్రీ కొడుకులు గుడికి చేరుకున్నారు. అమ్మ‌వారి ప‌వ‌ళింపు సేవ త‌ర్వాత మూసివేసిన గ‌ర్భ‌గుడి త‌లుపుల్ని తెరిచారు. రాత్రి 11 గంట‌ల నుంచి అర్థ‌రాత్రి 12.45 గంట‌ల వ‌ర‌కు అత్యంత ర‌హ‌స్యంగా భైర‌వీ పైజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఆ క్ర‌తువు పూర్తి అయ్యాక గుడి త‌లుపులు వేసి వెళ్లిపోయారు.

ఈ విష‌యం గుట్టుగా ఉన్న‌ట్లు అనుకున్నా.. మొత్తానికి బ‌య‌ట‌కు పొక్కింది. ఇది నిజ‌మేన‌న్న విష‌యం అంత‌రాల‌యం ముందు దుర్గ‌గుడిలో సంబంధం లేని వ్య‌క్తులు కాషాయ వ‌స్త్రాల‌తో క‌నిపించ‌టంతో క‌ల‌క‌లం రేగింది. గుడి త‌లుపులు మూసిన త‌ర్వాత తెర‌వ‌టం.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా తాంత్రిక పూజ‌లు నిర్వ‌హించ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. తాజాగా ఈ వ్య‌వ‌హ‌రంపై ఏపీ దేవాదాయ శాఖామంత్రి స్పందించి.. ఈ ఉదంతంపై విచార‌ణ‌కు ఆదేశించి.. చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతున్నారు. కోట్లాది మంది భ‌క్తుల సెంటిమెంట్ల‌ను దెబ్బ తీసేలా.. రూల్స్ ను బ్రేక్ చేసేంత బ‌రితెగింపు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.