Begin typing your search above and press return to search.

26 నుంచి బెజవాడ లాక్డౌన్ ప్రకటన, వెంటనే విరమణ

By:  Tupaki Desk   |   23 Jun 2020 5:02 PM GMT
26 నుంచి బెజవాడ లాక్డౌన్ ప్రకటన, వెంటనే విరమణ
X
కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ తొలుత తడబడినా... తదనంతరం వేగంగా స్పందించింది. కరోనా వ్యాప్తి అరికట్టడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో కీలకమైనది పెద్ద ఎత్తున టెస్టులు జరపడం. రోజుకు 10-20 వేల మధ్య టెస్టులు జరుగుతున్నాయి. కోట్లలో మన జనాభా ఉండటం వల్ల ఈ సంఖ్య చిన్నది అనిపించినా... ఓవరాల్ గా ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే భారీగానే చేస్తున్నట్టు లెక్క.

టెస్టులు మాత్రమే చాలదని... కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నచోట మళ్లీ లాక్ డౌన్ అస్త్రాన్ని కూడా ఏపీ సర్కారు ప్రయోగిస్తోంది. ఇప్పటికే అనంతపురం, ప్రకాశం తదితర జిల్లాల్లో లాక్ పునరుద్ధరించింది ఏపీ ప్రభుత్వం. కరోనా వేగంగా విస్తరిస్తున్న ఏపీలోని ప్రధాన నగరాల్లో ఒకటైన విజయవాడను కూడా 26వ తేదీ నుంచి లాక్ డౌన్ చేయనున్నట్టు కలెక్టర్ కార్యాలయం నుంచి తొలుత ప్రకటన వచ్చింది. ఇది చర్చకు దారితీసింది. అబ్బా.. మళ్లీ లాక్ డౌనా అని జనం బేజారయ్యారు.

ఒకవైపు ప్రతి ఇంటికి టెస్టులు చేయడంతో పాటు వ్యాప్తి ఎక్కువున్న చోట లాక్ డౌన్ ద్వారా అరికట్టాలనే క్రమంలో ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. అయితే, కారణాలు ఇంకా తెలియడం లేదు గాని.. లాక్ డౌన్ నిర్ణయాన్ని విరమించుకుంటున్నట్లు మళ్లీ కలెక్టరు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు లాక్ డౌన్ ఏదీ ఉండదని కలెక్టర్ కార్యాలయం పేర్కొంది.