Begin typing your search above and press return to search.

బెజవాడోళ్ల పెద్ద మనసుకు ఫిదా అయిపోయిన ఆంధ్రోళ్లు

By:  Tupaki Desk   |   4 Feb 2022 2:20 AM GMT
బెజవాడోళ్ల పెద్ద మనసుకు ఫిదా అయిపోయిన ఆంధ్రోళ్లు
X
పేరుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక్కటే అయినా.. అక్కడి ప్రజలు ప్రాంతాల వారీగా వేర్వురుగా ఉంటారని చెబుతుంటారు. కలిసి ఉన్నట్లే కనిపిస్తూ.. ఎవరి దారిన వారు ఉన్నట్లుగా వ్యవహరించే ధోరణి.. ఏపీ డెవలప్ మెంట్ మీద ప్రభావం చూపుతుందన్న విమర్శ కూడా ఉంది. ఉత్తరాంధ్రకు కోస్తాకుపెద్దగా పడదు. సీమకు.. కోస్తా వాళ్లకు పొసగదన్న వాదనల్ని స్వయంగా ఆంధ్రోళ్ల నోట్లో నుంచే వస్తుంటాయి. కారణం ఏదైనా కావొచ్చు.. బెజవాడోళ్లకు.. గుంటూరోళ్లకు తామంటే చిన్నచూపు అన్న భావన ఏపీలోని చాలా జిల్లాల వారి నోటి నుంచి తరచూ వినిపిస్తూ ఉంటుంది.

తాజాగా చోటు చేసుకున్న పరిణామం.. తమకు ఎదురైన అతిథ్యం ఏపీ వ్యాప్తంగా వచ్చిన వివిధ జిల్లాల వారు బెజవాడోళ్ల అతిధ్యానికి.. పెద్ద మనసుకు కదిలిపోవటమే కాదు.. మీ మర్యాదతో మా మనసుల్ని టచ్ చేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ నిర్ణయంపై కన్నెర్ర చేసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చలో విజయవాడ అంటూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించటం.. ఎవరూ ఊహించలేనంత భారీగా.. లక్షల్లో ఉద్యోగులు విజయవాడకుచేరుకోవటంతో.. రోడ్లన్ని జన సంద్రంగా మారాయి.

పేరుకు ఫిబ్రవరి నెల అయినప్పటికీ పగలు చుర్రుమనే ఎండకు తాళ లేక వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గంటల తరబడి రోడ్ల మీద సమరోత్సాహాన్నిప్రదర్శించినవారు అలిసిన వేళలో.. బెజవాడలోని పలు వీధుల్లోని మహిళలు.. తమకు తాముగా మంచినీళ్లు.. మజ్జిగను అందిస్తూ తమ అభిమానాన్నిచాటుకున్నారు. మా ఊరుకు వచ్చారు.. మీకు కష్టం వస్తే ఎలా? మేం ఉన్నాం.. ఆదరించటానికి.. అన్నట్లుగా వారు స్పందించిన తీరుకు ఫిదా అయిపోయారు వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు.

మర్యాద అంటే గోదారోళ్ల తర్వాతే ఎవరైనా అన్న మాటకు జతగా.. ఇకపై బెజవాడ వారి గురించి కూడా చెప్పుకోవాల్సిందే అన్నట్లుగా వారురియాక్టుఅయిన తీరుకు పులకరించిపోయారు వేలాది ఉద్యోగులు. నిరసనలతో అలసిన వారికి అవసరమైన నీటిని.. మజ్జిగను.. కొన్నిచోట్ల పులిహోర పొట్లాలను కూడా తయారు చేసి అందించిన వైఖరితో.. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు పులకరించటమే కాదు.. స్థానిక మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. ఏమైనా.. ప్రభుత్వ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న తమకు అండగా నిలిచిన స్థానికులకు తాము రుణపడి ఉంటామని.. బెజవాడోళ్ల మర్యాదను తాము మర్చిపోలేమన్న మాట పెద్ద ఎత్తున వినిపించింది.