Begin typing your search above and press return to search.

విజయవాడ రైల్వేస్టేషన్ ప్రైవేటుపరం?

By:  Tupaki Desk   |   15 April 2021 1:30 PM GMT
విజయవాడ రైల్వేస్టేషన్ ప్రైవేటుపరం?
X
'కాదేది అమ్మడానికి అనర్హం' అన్నట్టుగా మోడీ సర్కార్ పాలన ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కు నుంచి తుప్పు పట్టిన నౌకల వరకు ఏది దొరికితే అది అమ్మేస్తూ సొమ్ముకుంటున్న కేంద్రప్రభుత్వం కన్ను ఇప్పుడు రైల్వేశాఖపై పడిందంటున్నారు. రైల్వేల్లో కీలకమైన రైల్వే స్టేషన్లను ప్రైవేటుపరం చేసేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

రీడెవలప్ మెంట్ పేరిట 99 ఏళ్ల పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దక్షిణ మధ్య రైల్వేలో ఎంతో ముఖ్యమైన ఈ రైల్వే స్టేషన్ ను ప్రైవేటుపరం చేయడాన్ని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

బెజవాడ రైల్వే స్టేషన్ ను ఆధునీకించే పేరిట గతంలోనే ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని నిర్ణయించారు. అయితే ఎవరూ ముందుకు రాకపోవడంతో వెనుకడుగు వేశారు. ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలకు గుత్తగా రైల్వే స్టేషన్ ను 99 ఏళ్లకు అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించింది. ఇందులో విజయవాడ రైల్వే స్టేషన్ ను కూడా ఏ1లో చేర్చారు.

విజయవాడ డివిజన్ నుంచి రైల్వేలకు భారీ ఆదాయం వస్తోంది. ప్రతిరోజు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి పెద్ద స్టేషన్ ను ప్రైవేటుకు ఇస్తే వారికి దోచిపెట్టడమేనని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే రైల్వే శాఖకు లాభాలు తెచ్చిపెడుతుందని అంటున్నారు. ప్రైవేటుకు ఇస్తే ప్రయాణికులపై తీవ్ర భారం పడుతుందని రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు.