Begin typing your search above and press return to search.

మహానాడుకు 10 వేల మంది కూడా రాలేదు

By:  Tupaki Desk   |   27 May 2018 8:50 AM GMT
మహానాడుకు 10 వేల మంది కూడా రాలేదు
X
2019 ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందా అన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో మొదలైంది. అందుకు కారణం.. మహానాడు వెలవెలపోవడమే. విజయవాడలో జరుగుతున్న టీడీపీ 34వ మ‌హానాడుకు అనుకున్న దాంట్లో మూడోవంతు కార్యకర్తలు మాత్రమే వచ్చినట్లు చెబుతున్నారు. 30వేల మంది వ‌స్తార‌ని, వారంద‌రికీ ఏర్పాట్లు చేస్తున్నామ‌ని తెలుగుదేశం పార్టీ నేత‌లు చెప్పినా వచ్చింది గట్టిగా 10 వేల మంది కూడా ఉండరని అంటున్నారు. మధ్యాహ్నమైనా కూడా స‌భా ప్రాంగ‌ణం నిండకపోవడంతో సమీప ప్రాంతాల నుంచి జనాన్ని తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడు రోజుల పాటు జ‌రిగే మ‌హానాడుకు తొలిరోజే హాజరు పలచగా ఉంటే మిగతా రెండు రోజుల్లో ఈమాత్రం కూడా ఉండకపోవచ్చని టీడీపీ వర్గాల నుంచే వినిపిస్తోంది. దీంతో వెంటనే సమీప జిల్లాల నుంచి అనుచరులను, కార్యకర్తలను తరలించేందుకు ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు హడావుడి పడుతున్నారు.

కృష్ణా జిల్లాలో కొద్దిరోజుల కిందటే జగన్ పాదయాత్ర సాగడం.. ఇప్పుడు కూడా పొరుగు జిల్లా పశ్చిమగోదావరిలో ఆయన పాదయాత్ర సాగుతుండడంతో ఆ ప్రభావం మహానాడుపై పడిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనపై జనానికి మొహం మొత్తిందని.. ఆ ప్రభావం మహానాడులో కనిపిస్తోందని అంటున్నారు. ఎండల తీవ్రత కారణంగా హాజరు తగ్గిందని టీడీపీ నేతలు సాకులు చెబుతున్నప్పటికీ ప్రతి ఏటా ఇదే తేదీల్లో మహానాడు నిర్వహిస్తారని.. ఎండల ప్రభావానికి దీనికి సంబంధం ఉండదని విమర్శకులు అంటున్నారు. మొత్తానికైతే మహానాడు వెలవెలబోయిందన్నది మాత్రం వాస్తవం.