Begin typing your search above and press return to search.

ఎంజీఆర్ ను జయలలిత ముంచేసిందట

By:  Tupaki Desk   |   9 Oct 2015 7:47 AM GMT
ఎంజీఆర్ ను జయలలిత ముంచేసిందట
X
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆరోపణలు, విమర్శలు చేయడానికి ఎవరైనా వెనుకాడుతారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు కూడా వ్యక్తిగత విమర్శలు చేయడానికి భయపడతారు. డీఎంకే తప్ప చిన్నాచితకా పార్టీలవారైతే రాజకీయ విమర్శలే తప్ప అంతకుమించి ముందుకుపోలేరు. కానీ.. కొద్దికాలంగా పరిస్థితులు మారుతున్నాయి. జయలలిత అనారోగ్యం కారణంగా బలహీనపడుతున్నారు... రాజకీయంగానూ చురుగ్గా లేరు... దీంతో రాజకీయ పార్టీలు ఆమెను ఎదుర్కోవడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నాయి. అందులోభాగంగానే ఇప్పుడిప్పుడే బలపడుతున్న డీఎండీకే నేత విజయకాంత్ కూడా స్పీడు పెంచారు. తూత్తుకుడిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గురువారం విజయకాంత్ మాట్లాడుతూ జయలలితలపై నిప్పులు చెరిగారు... రాజకీయ విమర్శలను తలపించేలా వ్యక్తిగత విమర్శలకు దిగారు. జయలలిత ప్రజలకే కాదు ఎంజీఆర్ కూ పంగనామాలు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

మరోవైపు తమిళనాడులో శాంతి భద్రతలు సూపరని సీఎం జయలలిత చెబుతున్నారు కానీ ఎవరూ దాన్ని నమ్మడం లేదని... పోలీసు భద్రత మీద తమకు నమ్మకం లేదంటూ ఏకంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనడమే దీనికి ఉదాహరణని విజయకాంత్ కడిగిపారేశారు. కేంద్ర భద్రత అవసరం అని కోర్టు వ్యాఖ్యలు చేస్తుండడం బట్టి చూస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ మేరకు క్షీణించాయో స్పష్టం అవుతోందన్నారు. కూడంకులం అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమం సాగుతున్న సమయంలో కేంద్రానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జయలలిత, ఇప్పుడు ఆ కేంద్రంలో ఉత్పత్తి ఆగిందంటూ, అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడం బట్టిచూస్తే, ఏ మేరకు అక్కడి ప్రజల్ని ఆమె మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని ధ్వజమెత్తారు.

వచ్చే ఎన్నికల్లో జయ ఓడిపోవడం ఖాయమని విజయకాంత్ ఘంటా పథంగా చెబుతూ.... ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని డీఎండీకేకు ఓటేయాలని ప్రజలను కోరారు. జయలలిత ఎంజీయార్‌ కు కూడా పంగనామాలు పెట్టిందని... ఆమెను ప్రజలెవరూ నమ్మొద్దని విజయకాంత్ అన్నారు.