Begin typing your search above and press return to search.

కంప్లీట్ మెన్’’ ఇంట ఆస్తి తగాదాలు

By:  Tupaki Desk   |   22 Aug 2015 4:45 AM GMT
కంప్లీట్ మెన్’’ ఇంట ఆస్తి తగాదాలు
X
‘ద కంప్లీట్ మెన్’ అన్న వెంటనే.. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ రేమాండ్ యాడ్ గుర్తుకు రాక మానదు. అలాంటి కంప్లీట్ మెన్ ఇంట్లోని ఆస్తి తగదా ఇప్పుడు కోర్టు వరకూ వెళ్లి రచ్చగా మారింది. రేమాండ్ వ్యవస్థాపకుడు విజయపథ్ సింఘానిగా వారసులు తమ ఆస్తి కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించటం.. వారి పిటీషన్ ను సదరు న్యాయస్థానం తోసిపుచ్చటం లాంటి ఘటనలతో ఇప్పుడీ అంశం వ్యాపార వర్గాల్లోనూ.. సామాన్యుల్లోనే చర్చగా మారింది.

ఈ మొత్తం వివాదాన్ని మొదటి నుంచి చూస్తే.. 1998లో మేనేజ్ మెంట్ విధానాలకు సంబంధించి రేమండ్ వ్యవస్థాపకుడు విజయపథ్ సింఘానియాకు.. ఆయన కుమారుడు మధుపతికి మధ్య గొడవలొచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఈ సందర్భంగా చేసుకున్న ఒప్పందంలో భాగంగా మధుపతి తన ఫ్యామిలీతో సింగపూర్ లో స్థిరపడ్డారు. ఈ సందర్భంగా తనకున్న వాటాను.. ఆస్తి హక్కుల్ని వదిలేశారు. ఇదే సమయంలో మైనర్లుగా ఉన్న తన పిల్లల వాటాను కూడా ఆయన తండ్రికి రాసిచ్చేశారు.

అలా జరిగిపోయిన ఘటనకు సంబంధించి తాజాగా వివాదం రూపంలో కోర్టు గుమ్మం తొక్కింది. తండ్రి.. కొడుకుల మధ్య జరిగిన గొడవ.. ఒప్పందాల మీద కొడుకు కొడుకుల్లో (అంటే.. మధుపతి కొడుకులు.. విజయపథ్ సింఘానియా మనమలన్న మాట) చిన్నవాడైన (రైవత్ హరి సింఘానియా) 18ఏళ్లు నిండి మైనర్ కాస్తా.. మేజర్ కావటంతో.. తన తండ్రి.. తాతలు చేసుకున్న ఒప్పందం చెల్లదంటూ కోర్టు గుమ్మం తొక్కాడు.

ఈ సందర్భంగా తన ముగ్గురు అక్కల (అనన్య29, రసాలిక 26, తరుణి 20)తో కలిసి కోర్టును ఆశ్రయించాడు. తన తండ్రికి ఉన్న ఆస్తులతోపాటు.. తమకున్న ఆస్తులపై హక్కుల్ని వదిలేసుకుంటూ తండ్రి తీసుకున్న నిర్ణయాన్ని వారు ప్రశ్నించారు. నాడు తండ్రి వదులుకొన్న ఆస్తి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1166కోట్లు కావటం.. దాన్ని తాజాగా విజయపథ్ సింఘానిగా మరో కొడుకు గౌతమ్ కు కట్టబెట్టటంతో వివాదం కాస్తా కోర్టు వరకూ వెళ్లింది.

హిందూ కుటుంబ చట్టం ప్రకారం వారసుల హక్కులను కాలరాస్తూ.. ఒక్కరికే ఆస్తిని కట్టబెట్టే అధికారం రేమండ్ పెద్దాయన.. తమ తాత అయిన విజయపథ్ కు లేదంటూ మనవడు.. మనమరాళ్లు కోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ పిటీషన్ ను ముంబయి కోర్టు తోసిపుచ్చింది. ఇంత జరిగినా.. రేమండ్ షేర్ మాత్రం ఎలాంటి కుదుపులకు లోను కాకుండా క్లోజ్ కావటం విశేషం. స్టాక్ మార్కెట్ మొత్తం భారీ నష్టాల్ని మూటగట్టుకున్న వేళ.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆస్తి వివాదం రేమండ్ షేర్ మీద ఎలాంటి ప్రభావం చూపించకపోవటం విశేషంగానే చెప్పాలి.