Begin typing your search above and press return to search.

సభలోనే జైరాం రమేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయి

By:  Tupaki Desk   |   9 Aug 2022 4:25 AM GMT
సభలోనే జైరాం రమేశ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయి
X
కాంగ్రెస్ సీనియర్ నేతగా.. బుర్రలో కాసింత ఎక్కువ గుజ్జు ఉన్న వ్యక్తిగా.. విషయాల మీద పట్టు ఉన్న నేతల్లో కీలక సభ్యుడిగా చెప్పే జైరాం రమేష్ పై వైసీసీ రాజ్యసభ సభ్యుడు తాజాగా ఘాటు విమర్శలు చేశారు. ఏపీ విభజన చట్టాన్ని డ్రాప్టు చేసిన సభ్యుల్లో జైరాం కీలకంగా వ్యవహరించారు. నిజానికి ఆయనే.. దీన్ని పూర్తిగా తయారు చేశారని చెప్పాలి. జైరాం రమేశ్ రాసిన తప్పుల తడకతో రాష్ట్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందన్నారు.

అంతేకాదు.. విభజన హామీలు అమలు కావటం లేదన్న విజయసాయి.. ఒడిశాలోని గనుల శాఖ నుంచి రైల్వే శాఖకు బొగ్గు సరఫరా చేయకపోవటంతో విశాఖ స్టీల్ ప్లాంట్ లోని రెండు ఫర్నేస్ లు మూతపడిన వైనాన్ని వెల్లడించారు.

తాజాగా రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ విజయసాయి జైరాం రమేశ్ తప్పులు ఏపీకి శాపంగా మారినట్లుగా అభివర్ణించారు. ''దురద్రష్టవశాత్తు నా స్నేహితుడు జైరాం రమేశ్ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని తప్పుల తడకగా రూపొందించారు'' అని పేర్కొన్నారు.

ఏపీ విభజన చట్టంలో ''Shall'' అన్న పదం ఉండాల్సిన చోట ''May'' అనే పదాన్ని ఉపయోగించడంతో.. దీన్నో అవకాశంగా తీసుకున్న ఎన్డీయే సర్కారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

జైరాం రమేశ్ తప్పులకు ఆంధ్రప్రదేశ్ మూల్యం చెల్లించాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఈ అంశాల్ని పరిగణలోకి తీసుకొని విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు.

మొత్తానికి రాష్ట్రం విడిపోయిన 8 ఏళ్లకు.. చట్టం రాసిన జైరాంరమేశ్ రాసిన తప్పులన్న విషయాన్ని ఇంతకాలానికి గుర్తించి.. పెద్దల సభ సాక్షిగా వ్యాఖ్యానించటం గమనార్హం. ఇన్నాళ్లకు కానీ.. ఏపీకి జరిగిన నష్టం గుర్తుకు రాలేదా? అన్నది అసలు ప్రశ్న.