Begin typing your search above and press return to search.

కేసీఆర్ అజెండా ఏంటో చెప్పిన రాములమ్మ‌!

By:  Tupaki Desk   |   28 Jan 2019 6:15 AM GMT
కేసీఆర్ అజెండా ఏంటో చెప్పిన రాములమ్మ‌!
X
గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ రాజ్ భ‌వ‌న్ లో ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎట్ హోం కార్య‌క్ర‌మంలో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈ కార్య‌క్ర‌మంలో గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ - ఆయ‌న కుమారుడు కేటీఆర్ లు ప‌వ‌న్ తో విడివిడిగా ఏదో మాట్లాడ‌టం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటుపై వారు చ‌ర్చించి ఉండొచ్చ‌ని ప‌లు విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత విజ‌య‌శాంతి ట్విట‌ర్ లో స్పందించారు. కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడికి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు కేసీఆర్ ఆరాట‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. ఆ ప్ర‌య‌త్నాల్లో భాగంగా జ‌గ‌న్‌-వ‌ప‌న్ ల‌ను క‌ల‌ప‌ట‌మే కెసీఆర్ అజెండా అని ఆరోపించారు. ఎట్ హోం కార్య‌క్ర‌మంలో ఈ విష‌యంపైనే ప‌వ‌న్ తో కేసీఆర్‌-కేటీఆర్ చ‌ర్చించి ఉండొచ్చ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అన్ని ప్ర‌ధాన పార్టీల‌కు స‌మ‌దూరం పాటిస్తున్న ప‌వ‌న్ ను ఏదో ఓ ర‌కంగా వివాదాల్లోకి లాగేందుకు టీఆర్ ఎస్ ప్ర‌య‌త్నిస్తోంద‌ని రాముల‌మ్మ ఆరోపించారు. అయితే - కేసీఆర్ ఉచ్చులో ప‌వ‌న్ ప‌డ‌క‌పోవ‌చ్చున‌ని జోస్యం చెప్పారు. 2009లో కేసీఆర్ ప్రజారాజ్యంతో పొత్తును నిరాక‌రించి టీడీపీతో జ‌త క‌ట్టిన సంగ‌తిని విజ‌య‌శాంతి గుర్తుచేశారు. నాటి ప‌రిణామాల‌పై ప‌వ‌న్ కు పూర్తి అవ‌గాహ‌న ఉంద‌ని తెలిపారు. అలాంటి టీఆర్ ఎస్ జిత్తుల‌న్నీ తెలుసు కాబ‌ట్టి ప‌వ‌న్ అంత తేలిగ్గా కేసీఆర్ ఉచ్చులో ప‌డ‌బోర‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మాయావతి-అఖిలేష్ యాదవ్‌ ల మాదిరిగా పవన్ కళ్యాణ్- చంద్రబాబు కలిస్తే తప్పేంట‌ని ఏపీ టీడీపీ నేత‌ టి.జి.వెంక‌టేశ్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం సృష్టించిన వ్య‌వ‌హారంపై కూడా రాముల‌మ్మ స్పందించారు. ప‌వ‌న్ కోసం టీడీపీ ఆరాట‌ప‌డుతున్న సంగ‌తిని ఆ మాట‌లు స్ప‌ష్టం చేస్తున్నాయ‌న్నారు. ఆ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం కొన‌సాగుతుండ‌గానే రాజ్ భ‌వ‌న్ లో ప‌వ‌న్-కేసీఆర్ మంత‌నాలు జ‌ర‌గ‌డం మ‌రింత గంద‌ర‌గోళానికి దారితీసిన‌ట్లు విజ‌య‌శాంతి పేర్కొన్నారు. ఏపీకి వెళ్ళి వైసీపీ అధినేత‌ జగన్‌ తో ఫెడరల్ ఫ్రంట్‌ పై చర్చిస్తానన్న కేసీఆర్... దానికి ముందే పవన్‌ తో మంతనాలు జరపడం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం సందేశం ఇవ్వ‌ద‌ల్చుకున్నార‌ని రాముల‌మ్మ ప్ర‌శ్నించారు. కేంద్రంలో బీజేపీ-కాంగ్రెస్ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చెయ్యడం కంటే వైసీపీ - జనసేన లను ఒకే వేదిక మీదకు తీసుకురావ‌డ‌మే కేసీఆర్ ప్ర‌ధాన అజెండాగా క‌నిపిస్తోంద‌ని ఆరోపించారు.