Begin typing your search above and press return to search.

అరంగేట్రం అదరగొట్టేశాడు

By:  Tupaki Desk   |   11 Oct 2015 5:47 AM GMT
అరంగేట్రం అదరగొట్టేశాడు
X
భారత్ క్రీడాభిమానులకు మరో సంతోషం కలిగించే వార్త ఇది. బాక్సింగ్ లో భారత్ సత్తాను యువ బాక్సర్ విజేందర్ తన సత్తా మరోసారి చాటారు. అమెచ్యూర్ బాక్సింగ్ ను వదిలేసి.. ప్రొఫెషనల్ బాక్సింగ్ ను ఎంచుకున్న విజేందర్.. తాను తీసుకున్న నిర్ణయం నూటికి నూరుపాళ్లు కరెక్టేనని నిరూపించారు.

అమెచ్చూర్ బాక్సింగ్ ను వదిలి.. ప్రొఫెషనల్ బాక్సింగ్ లోకి అడుగు పెడుతున్నానని విజేందర్ ప్రకటించిన సమయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రిస్క్ తీసుకుంటున్నాడన్న మాట వినిపించింది. ఈ మాటలు ఎలా ఉన్నా.. ప్రొఫెషనల్ బాక్సింగ్ పోటీల్లో తొలిసారి పాల్గొన్న విజేందర్ తన సత్తా ఏమిటో రింగులో చాటాడు.

శనివారం రాత్రి జరిగిన పోటీలో బ్రిటన్ బాక్సర్ సన్నీ వైటింగ్ తో తలపడిన విజేందర్.. మరో రౌండ్ ఉండగానే విజేతగా నిలిచారు. ఈ పోటీకి ముందు తన మాటలతో వాతావరణాన్ని వేడిపుట్టించిన బ్రిటీష్ బాక్సర్.. రింగులో మాత్రం అంత ప్రభావాన్ని చూపించలేకపోయారు. మూడు నిమిషాల వ్యవధి ఉన్న రౌండ్లు మొత్తం నాలుగు జరగాల్సి ఉన్నా.. పిడుగుల్లాంటి బాక్సింగ్ పంచ్ లతో విజేందర్ రింగులో చెలరేగిపోవటంతో.. మూడో రౌండ్ లోనే బ్రిటీష్ బాక్సర్ చేతులెత్తేశాడు.

విజేందర్ పిడుగుల్లాంటి పంచ్ లకు కళ్లు తేలేసిన ప్రత్యర్థి వైఖరిని.. ఆటను నిలిపేసిన రిఫరీ.. విజేందర్ ను విజేతగా ప్రకటించారు. తాజా మ్యాచ్ తో ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అరంగేట్రం చేసిన విజేందర్.. ఆరంభాన్ని ఆదరగొట్టారని చెప్పక తప్పదు.