Begin typing your search above and press return to search.

పీక్స్ నుంచి పతనం దాకా.. ముగిసిన వివేక్ దూబే కథ!!

By:  Tupaki Desk   |   10 July 2020 6:45 AM GMT
పీక్స్ నుంచి పతనం దాకా.. ముగిసిన వివేక్ దూబే కథ!!
X
ఎంతటి శక్తివంతుడైనా కావొచ్చు. ఒక్క తప్పు చాలు.. మొత్తం కథ ముగిసిపోవటానికి. సినిమాల్లో చూపించినట్లుగా పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్లు చాలా తక్కువగా ఉంటారు. ఒకవేళ ఉన్నా.. ఇష్టారాజ్యంగా చెలరేగిపోయేటోళ్లు కొద్దిమందే. ఆకాశమే హద్దు అన్నట్లుగా వ్యవహరించే వారిలో ఉత్తరప్రదేశ్ కు చెందిన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఒకరని చెబుతారు. దాదాపు పందొమ్మిదేళ్ల క్రితమే యూపీ రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లాను లేపేసిన నేర చరిత్ర అతని సొంతం. కొన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా.. ఎవరో ఒకరు కాపాడేందుకు ఉంటారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందని అస్సలు అనుకోకూడదు. ఆ విషయాన్ని మిస్ అయిన వికాస్ దూబే తాజాగా ఎన్ కౌంటర్ లో బలయ్యాడు.

ఒక చేత్తో రాజకీయ నేతల్ని.. మరో చేత్తో పోలీసుల్ని బ్యాలెన్స్ గా నడిపిస్తున్న అతడిలో కాన్ఫిడెన్సు లెవెల్స్ పెరిగిపోయాయి. తానో తిరుగులేని శక్తిగా తనకు తానుగా అనుకునేవాడు. కానీ.. వ్యవస్థ ఒక్కసారి సరిగ్గా కళ్లు తెరిస్తే.. తనలాంటోళ్లు ఎవరైనా మటాష్ అయిపోతారన్న వాస్తవాన్ని మిస్ అయ్యాడు. ఆ మధ్యన అధికారంలోకి వచ్చిన యోగి సర్కారు.. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రంలోని నేరచరితల లెక్కలు తేల్చేస్తున్నారు. పలువురిని లేపేయటమే కాదు.. యూపీ నేర స్రామాజ్యాన్ని ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వికాస్ దూబే మీదా కన్ను పడింది. గతంలో ఇతగాడు హతమార్చింది బీజేపీ మంత్రినే. ఇదిలా ఉంటే.. కాన్పూరు నగరాన్ని తన కనుసన్నలతో శాసిస్తాడన్న పేరున్న అతగాడి నేరచరితపై యూపీ సర్కారు నజర్ వేసింది. అతడ్ని అదుపులోకి తీసుకునేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. పోలీసు శాఖలతో తనకున్న చెంచాలతో సమాచారాన్ని అందుకున్న తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. తనను పట్టుకునేందుకు పోలీసులు తర్వాతి రోజు వస్తారన్న సమాచారానికి బదులుగా.. రాత్రికి రాత్రే తన ఇంటిని చుట్టుముట్టటంతో విచక్షణ కోల్పోయాడు.

ముందు వెనుకా ఆలోచించకుండా పోలీసులపైనే కాల్పులు జరిపించాడు. డీఎస్పీ అధికారితో సహా మొత్తం ఎనిమిది మందిని కాల్చి చంపాడు. వాస్తవానికి వారందరిని తగలబెట్టి వారి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే.. పోలీసుల్నికాల్చి చంపిన వైనం ఉన్నతాధికారులకు తెలీటం.. వెంటనే అదనపు బలగాలు రంగంలోకి దిగటంతో ప్రాణాల్ని కాపాడుకునేందుకు అనుచరులతో కలిసి పారిపోయాడు. ఈ ఉదంతం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. వికాస్ దూబే వర్సెస్ వ్యవస్థ అన్నట్లుగా మారిపోయింది.

వ్యవస్థ ముందు వికాస్ లాంటి వాళ్లు అస్సలు నిలబడరన్నది తెలిసిందే. అతగాడికి సహకరించే రాజకీయ పెద్దల్ని సెట్ చేయటంతో పాటు.. అతడికి దన్నుగా నిలిచే పోలీసు అధికారులపై వేటు వేయటం.. చర్యలు తీసుకోవటంతో అతనికి ఎలాంటి సమాచారం అందని పరిస్థితి. అదే సమయంలో అతడిని పట్టుకునేందుకు జల్లెడ వేసిన యూపీ సర్కారు.. చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలను అలెర్టు చేసింది. ఈ క్రమంలోనే వికాస్ అనుచరులు ముగ్గురిని పోలీసులు దశల వారీగా ఎన్ కౌంటర్ చేశారు. దీంతో.. అతడి బలం సగం తగ్గింది.

ఉజ్జయిని మహాంకాళి టెంపుల్లో అతడ్నిమధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. తనను ఎన్ కౌంటర్లో హతమార్చకుండా ఉండేందుకు తెలివిగా పోలీసులకు లొంగిపోయే ప్లాన్ వేసుకున్నా.. అందుకు భిన్నంగా ఆలయంలో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తనను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో అడిగిన ప్రశ్నకు.. తాను కాన్పూర్ వాలా వికాస్ దూబే అని చెప్పినట్లుగా పోలీసులు వెల్లడించారు.

అనంతరం అతడ్ని విచారించిన క్రమంలో పలు విస్మయకర విషయాలు బయటకు వచ్చాయి. తాను హత మార్చిన పోలీసుల్ని తగలబెట్టేయాలని అనుకున్నానని.. కానీ కుదర్లేదని చెప్పటంతో పాటు.. తనకు సహకరిస్తున్న అధికారులు.. నేతలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించినట్లు చెబుతున్నారు. వికాస్ దూబే అరెస్టు విషయాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ఒక ట్వీట్ చేస్తూ.. అతడ్ని ఎన్ కౌంటర్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తనకో పోలీసు ఉన్నతాధికారి చెప్పినట్లుగా పేర్కొన్నారు. దీనిపై విమర్శలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. యూపీ కి తీసుకొచ్చే క్రమం లో వికాస్ దూబే ను ఎన్ కౌంటర్ చేసే అవకాశాలు ఎక్కువన్న వాదనలు వినిపించాయి. అందుకు తగ్గట్లే.. ఈ రోజు ఉదయం ఎన్ కౌంటర్ జరగటం గమనార్హం. ఇదంతాఒక ఎత్తు అయితే కాన్పూరు లోని అతడి నివాసం లో అతడి భార్య.. కొడుకు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికాస్ దూబే అరెస్టు జరిగిన వెంటనే ఈ పరిణామం చోటు చేసుకుంది. గతంలో వారి కోసం పోలీసులు రెండు సార్లు ప్రయత్నించినా వారి ఆచూకీ పోలీసులకు లభించకపోవటం గమనార్హం.

ఈ ఎపిసోడ్ మొత్తంలో ఆసక్తికరమైన రెండు విషయాల్ని ప్రస్తావించాలి.అందులో ఒకటి.. వికాస్ దూబేను అరెస్టు చేసిన తర్వాత ఐజీ అమితాబ్ ఠాకూర్ చేసిన ట్వీట్. యూపీకి తీసుకొచ్చే సమయంలో అతడు తప్పించుకునే ప్రయత్నం లో హతమవ్వొచ్చేమో. అప్పుడు వికాస్ దూబే చరిత్ర పరిసమాప్తి అవుతుందంటూ ఆయన చేసిన ట్వీట్ చూసినప్పుడే.. శుక్రవారం ఏం జరుగుతుందో అన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. దీనికి తగ్గట్లే.. ఎన్ కౌంటర్ జరగటం గమనార్హం. మరో ఆసక్తికరమైన అంశం గ్యాంగ్ స్టర్ తల్లి సరళా దేవి. తన కొడుకు ఎనిమిది మంది పోలీసుల్ని కాల్చి చంపటాన్ని తప్పు పట్టటమే కాదు.. అతడి విషయంలో ప్రభుత్వం ఏది సరైన దనిపిస్తే అది చేయొచ్చని చెప్పటం పలువురు అభినందిస్తున్నారు. అంతేకాదు.. అతడు బీజేపీకి చెందినవాడన్న మాటను ఆమె కొట్టి పారేస్తూ.. తన కొడుకు సమాజ్ వాదీ పార్టీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏది ఎలా ఉన్నా.. కొన్ని లక్షణ రేఖల్ని దాటినంతనే.. పతనం షురూ అవుతుందన్న విషయం వికాస్ దూబే ఎపిసోడ్ స్పష్టం చేస్తుంది. అంతేకాదు.. హింసను నమ్ముకున్నోడు.. అదే హింసకు బలి అవుతాడన్నది మరోసారి రుజువైందని చెప్పక తప్పదు.