Begin typing your search above and press return to search.

ఆళ్ల‌గ‌డ్డ అక్క‌ల‌పై ఆ త‌మ్ముడు కోర్టుకెక్క‌డం డ్రామానేనా?

By:  Tupaki Desk   |   30 July 2022 7:36 AM GMT
ఆళ్ల‌గ‌డ్డ అక్క‌ల‌పై ఆ త‌మ్ముడు కోర్టుకెక్క‌డం డ్రామానేనా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో భూమా కుటుంబం గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. గ‌తంలో భూమా నాగిరెడ్డి, ఆయ‌న భార్య భూమా శోభా నాగిరెడ్డి.. నంద్యాల‌, ఆళ్లగడ్డ నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏలారు. భూమా నాగిరెడ్డి ఎంపీగానూ పోటీ చేశారు. భూమా నాగిరెడ్డి మామ ఎస్వీ సుబ్బారెడ్డి, బావ‌మ‌రిది ఎస్వీ మోహ‌న్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా ప‌నిచేశారు. త‌ద్వారా క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో భూమా నాగిరెడ్డి త‌న‌దైన ముద్ర వేశారు. అయితే వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఎమ్మెల్యేలుగా ఉన్న‌ శోభా నాగిరెడ్డి కారు యాక్సిడెంటులో మృతి చెంద‌డం, ఆ త‌ర్వాత భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెంద‌డంతో వీరి కుమార్తె అఖిల ప్రియ రంగంలోకి వ‌చ్చారు.

గ‌త టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి.. అందుకు ప్ర‌తిఫ‌లంగా ప‌ర్య‌ట‌క శాఖ మంత్రి ప‌ద‌విని కూడా పొందారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆళ్ల‌గ‌డ్డ‌లో ఆమెకు ఓట‌మి ఎదురైంది. అలాగే ఆమె పెద‌నాన్న కుమారుడు భూమా బ్ర‌హ్మ‌నంద‌రెడ్డి నంద్యాల‌లో ఓడిపోయారు.

ఓట‌మి త‌ర్వాత భూమా అఖిల ప్రియ ప‌లు వివాదాల్లో చిక్కుకున్నారు. త‌న తండ్రి స్నేహితుడు ఏవీ సుబ్బారెడ్డిని హ‌త్య చేయించ‌డానికి సుపారీ ఇచ్చార‌నే ఆరోప‌ణ‌లు ఆమెపై వ‌చ్చాయి. అలాగే హైద‌రాబాద్ లో అత్యంత విలువైన స్థ‌లం వివాదం విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ బంధువుల‌ను కిడ్నాప్ చేయించి.. ఆ వ్య‌వ‌హారంలో అడ్డంగా దొరికిపోయారు. జైలుకు కూడా వెళ్లారు. ఆ త‌ర్వాత బెయిల్ పై బ‌య‌ట‌కొచ్చారు.

కాగా తాజాగా అఖిల ప్రియ సొంత త‌మ్ముడు జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించ‌డం సంచ‌ల‌నంగా మారింది. అఖిల‌ప్రియ‌తోపాటు త‌న రెండో అక్క భూమా మౌనికా రెడ్డిల‌పైన కూడా జ‌గ‌త్ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. ఆస్తి వివాదాలే ఇందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలో కిందికోర్టులో త‌న ఇద్ద‌రు అక్క‌ల‌పై జ‌గ‌త్ విఖ్యాత్‌రెడ్డి వేసిన కేసు నిల‌బ‌డ‌లేదు. దీంతో హైకోర్టును ఆశ్ర‌యించ‌డాని అంటున్నారు.

కాగా కేసు పూర్వాప‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ‌లోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం మంచిరేవుల‌లో భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుతో వెయ్యి గ‌జాల స్థ‌లం ఉంది. 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి దాదాపు రూ.2 కోట్ల‌కు వేరేవారికి అమ్మిన‌ట్టు తెలిసింది. అప్ప‌టికి శోభా నాగిరెడ్డి మ‌ర‌ణించ‌డంతో రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో భూమా నాగిరెడ్డి, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్లు అఖిల‌ప్రియ, మౌనిక సంత‌కాలు చేశారు. జ‌గ‌త్‌విఖ్యాత్‌రెడ్డి వేలిముద్ర వేశాడు.

ప్ర‌స్తుతం ఈ భూముల రేట్లు భారీగా పెర‌గ‌డంతో నాగిరెడ్డి రెండు కోట్ల రూపాయ‌ల‌కు అమ్మిన స్థ‌లం రూ.6 కోట్ల‌కు చేరింది. దీంతో తాము అమ్మిన భూమిపై అక్కాత‌మ్ముళ్ల కన్నుప‌డింద‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో 2019, న‌వంబ‌ర్ 14న ఇద్ద‌రు అక్కల‌తో పాటు ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన వారిపై కింది కోర్టులో జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి కేసు వేశాడు.

అయితే అక్క‌లిద్ద‌రూ కావాల‌నే జ‌గ‌త్ తో కేసు వేయించార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి త‌న లాయ‌ర్ గా అఖిల‌ప్రియ మ‌రిది శ్రీ‌సాయిచంద్ర‌హాస్ ను పెట్టుకోవ‌డం ఇందుకు నిద‌ర్శ‌న‌మంటున్నారు. అయితే కింది కోర్టులో వీరికి అనుకూలంగా తీర్పు రాలేదు. దీంతో జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి తాజాగా తెలంగాణ హైకోర్టులో ప్లాట్ల‌ను కొనుగోలు చేసిన ఐదుగురితో పాటు త‌న ఇద్ద‌రు అక్క‌ల‌పై కూడా కేసు వేశాడు.

త‌న‌కు 17 ఏళ్ల వ‌య‌సులో మైన‌ర్‌గా ఉన్న‌ప్పుడు స్థ‌లం అమ్మార‌ని.. ఇది చెల్ల‌ద‌ని.. ఇప్పుడు తాను మేజ‌ర్‌ని అని, త‌న‌కు భాగం కావాల‌ని జ‌గ‌త్ విఖ్యాత్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించాడు. జ‌గ‌త్ కోర్టుకు వెళ్ల‌డం వెనుక‌ అఖిల‌ప్రియ, ఆమె భ‌ర్త భార్గ‌వ్‌రామ్ ప్రోత్సాహ‌మే కార‌ణ‌మ‌ని స్థ‌లం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.