Begin typing your search above and press return to search.

బయోపిక్ కు తగ్గ కంటెంట్ ఉంది!

By:  Tupaki Desk   |   8 Sep 2019 4:22 PM GMT
బయోపిక్ కు తగ్గ కంటెంట్ ఉంది!
X
ఎలాంటి పరిచయం లేకుండా డాక్టర్‌ కె.శివన్‌ ఎవరు? అన్న మాటను సామాన్యుల్ని అడిగితే చెప్పలేని పరిస్థితి. అయితే.. ఇదంతా రెండు రోజుల క్రితం వరకూ. చంద్రయాన్ 2 ప్రయోగంలో చివర్లోచోటు చేసుకున్న పరిణామం.. అనంతరం ప్రధాని మోడీ వ్యవహరించిన తీరు.. ఇస్రో డైరెక్టర్ గా శివన్ చిన్నపిల్లాడిలా కన్నీరు పెట్టుకోవటం.. మోడీ ఓదార్చటం లాంటి పరిణామాలతో ఇస్రో ఛైర్మన్ పేరు సుపరిచితం కావటమే కాదు.. సాధారణ ప్రజలకు ఆయన బాగా తెలిసిపోయారు.

బక్కగా.. సగటు మధ్యతరగతి మనిషికి నిలువెత్తు రూపంలా ఉండే ఆయనకు.. ఆయన మేథో తనానికి ఏ మాత్రం సంబంధం ఉండదు. అంతరిక్ష రంగంలో ఆయనకున్న ప్రతిభ.. ఇస్రోలోని శాస్త్రవేత్తలందరికి తెలుసు. ఇదిలా ఉంటే.. శివన్ బ్యాక్ గ్రౌండ్ ను చూస్తే.. ఆసక్తికరంగానే కాదు.. స్ఫూర్తివంతంగా ఉంటుంది. ఇటీవల నడుస్తున్న బయోపిక్ లకు ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆయన జీవితం ఉంటుందని చెప్పాలి. పేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచలంచెలుగా ఎదుగుతూ చివరకు ఇస్రో చీఫ్ స్థాయికి చేరిన వైనం రోమాంచితంగా ఉండటమే కాదు.. ఆయనో స్ఫూర్తిదాతగా నిలుస్తారు. బయోపిక్ కంటెంట్ బోలెడంత ఉన్న శివన్ బ్యాక్ గ్రౌండ్ కి వెళితే..

% తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్ సమీపంలో మేళా సారకల్విలైలో జన్మించారు శివన్‌. అతని తల్లిదండ్రులు కైలాసవదీవానదార్, చెల్లమాల్. రైతు కుటుంబంలో జన్మించిన ఆయన కాలేజీలో చేరే వరకు ధోతి ధరించి.. ఉత్త కాళ్లతోనే తిరిగారంటే నమ్మగలమా?

% కష్టాలకు బెదిరిపోకుండా.. వాటిని ఎదురీదుతూ.. తన లక్ష్యానికి దగ్గరయ్యారు. తన జీవితంలో తన గ్రామం గురించి ఆయన ఆసక్తికర అంశాల్ని చెబుతారు. తన తండ్రి వ్యవసాయం చేసేవారని.. దీంతో తాము స్కూల్ నుంచి వచ్చినంతనే పొలానికి వెళ్లేవాళ్లమని చెప్పారు

% వేసవిలో తన తండ్రి మామిడి పండ్లను అమ్మేవారని.. స్కూల్ కు సెలవు వస్తే కూలీలను పిలవకుండా తమ చేత పొలంలో పని చేయించేవారన్నారు. పొలం పనుల్లో సాయంగా ఉండేందుకు వీలుగా తనను ఊరికి దగ్గర్లో ఉన్న కాలేజీలో చదివించినట్లు చెప్పారు.కాలేజీకి వెళ్లే వరకూ తాను ధోతినే వాడేవాడినని.. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కావన్నారు.

% అయితే.. తమది మరీ పేద కుటుంబం కాదని.. ఏ రోజూ అకలితో తన తల్లిదండ్రులు ఉంచలేదని.. మూడు పూటల భోజనం పెట్టేవారన్నారు. తనను ఇంజినీరింగ్ లో చేర్చమని అడిగితే.. అది చాలా ఖరీదైన కోర్సు కావటంతో తనను బీఎస్సీ కోర్సులో చేరమన్నారని.. కానీ తాను వారంపాటు అన్నం తినకుండా ఉండిపోయానని.. అయినప్పటికీ తన తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. దీంతో తానే తన నిర్ణయాన్ని మార్చుకొని బీఎస్పీలో చేరానన్నారు. అలా బీఎస్పీ మ్యాథ్స్ పూర్తి చేశానని చెప్పారు.

% తనను ఇంజనీర్ గా చూసేందుకు తన తండ్రి తర్వాతి కాలంలో పొలాన్ని కూడా అమ్మారని.. దాంతో వచ్చిన డబ్బుతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసినట్లు చెప్పారు. కోర్సు పూర్తి అయ్యాక వెంటనే ఉద్యోగం రాలేదన్నారు. ఇప్పటిలా అప్పట్లో ఎక్కువ ఉద్యోగాలు ఉండేవి కావని.. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో మాత్రం జాబ్స్ ఉండేవన్నారు.

% దీంతో ఉన్నత చదువుల కోసం ఐఐఎస్సీలో చేరానని.. తన జీవితంలో తాను కోరుకున్నది ఎప్పుడూ వెంటనే లభించలేదన్నారు. అయితే.. కష్టాలు తనను లక్ష్యం నుంచి దూరం చేయలేదన్నారు. కోరుకున్నది లభించనప్పుడు దాని గురించి బాధ లేదని.. తనకు దక్కిన దానితో తాను సంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు.

% తానో శాటిలైట్ సెంటర్లో చేరాలని భావిస్తే విక్రమ్ సారాభాయ్ సెంటర్లో చేరాల్సి వచ్చిందన్నారు. అక్కడ కూడా ఏరో డైనమిక్స్ లో జాయిన్ కావాలనుకుంటే తనకు పీఎస్ ఎల్ వీ ప్రాజెక్టులో చేరమన్నారన్నారు. ఇలా ప్రతి చోటా తాను కోరుకున్నది తనకు లభించలేదన్నారు. అయితే.. తాను ఇష్టపడనిది లభించకున్నా.. వచ్చిన దాన్ని విపరీతంగా ప్రేమించి ఉన్నత స్థానానికి శివన్ ఎదిగారని చెప్పాలి. ఇప్పుడు కూడా అంతే.. చంద్రయాన్ 2తో చంద్రుడ్ని ముద్దాడాలనుకున్న శివన్ కోరికను వెంటనే చంద్రుడు ఒప్పుకోలేదు. ఆయన ఆయన భావోద్వేగం.. ఆయన కష్టం గురించి కాస్త ఆలస్యంగా చంద్రుడికి తెలిసిందేమో? అందుకే.. నిన్న కనిపించకుండా పోయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించింది. రానున్న రోజుల్లో విక్రమ్ ల్యాండర్ సంకేతాల్ని ఇస్రోకు పంపుతుందేమో? చూడాలి.. ఎప్పుడేం జరుగుతుందో ఎవరు మాత్రం ఊహించగలరు?