Begin typing your search above and press return to search.

గ్రామ సచివాలయం ఉద్యోగం.. మూడేళ్ల బాండ్

By:  Tupaki Desk   |   4 Oct 2019 5:58 AM GMT
గ్రామ సచివాలయం ఉద్యోగం.. మూడేళ్ల బాండ్
X
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయటానికే ప్రభుత్వాలు కిందా మీదా పడుతుంటాయి. అలాంటిది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 1.20 లక్షల ఉద్యోగాల ప్రక్రియను పూర్తి చేయటమే కాదు.. వారందరికి అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చేసిన వైనం సంచలనంగా మారటమే కాదు.. ఇప్పుడో చర్చగా మారింది.

ముందుగా చెప్పినట్లే.. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని మెగా రిక్రూట్ మెంట్ ను పూర్తి చేసి.. నియామకపు ఉత్తర్వుల్ని ఇవ్వటం తెలిసిందే. జగన్ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియకు సానుకూల స్పందన లభిస్తోంది. అయితే.. మీడియాలో వస్తున్న కథనాలు ఇప్పుడు కొత్త గందరగోళానికి తెర తీస్తున్నాయి. నియామక ఉత్తర్వులు పొందిన వారి సంతోషాన్ని ఆవిరి చేసేలా కొన్ని కథనాలు కొత్త ఆందోళనల్ని రేకెత్తిస్తున్నాయి.

తాజాగా వెలువడుతున్న కథనాల ప్రకారం గ్రామ సచివాలయ కార్యదర్శులుగా ఎంపికైన వారు ప్రభుత్వానికి మూడేళ్లపాటు పని చేస్తామని.. మధ్యలో ఉద్యోగాన్ని వదలమని బాండ్ రాసి ఇవ్వాలన్న క్లాజ్ పెట్టినట్లు చెబుతున్నారు. ఒకవేళ మధ్యలో మానేసిన వారు.. అప్పటివరకూ పొందిన జీతాన్ని.. వారి శిక్షణకు అయ్యే ఖర్చును తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్న నిబంధనను పెట్టినట్లుగా చెబుతున్నారు.

దీంతో.. ఉద్యోగం పొందినోళ్లకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఎందుకంటే.. మూడేళ్ల వ్యవధిలో ఏదైనా మంచి ఉద్యోగం వస్తే.. వెళ్లటానికి మూడేళ్ల బాండ్ అడ్డుగా మారుతుందంటున్నారు. అదే సమయంలో తీసుకున్న జీతాన్ని తిరిగి చెల్లించాల్సి రావటం ఇబ్బంది అవుతుందన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంతన్న విషయం మీద ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.