Begin typing your search above and press return to search.

ప్రభుత్వ సచివాలయాలకు తాళాలు వేసిన యజమానులు.. కారణమిదే!

By:  Tupaki Desk   |   21 May 2022 8:30 AM GMT
ప్రభుత్వ సచివాలయాలకు తాళాలు వేసిన యజమానులు.. కారణమిదే!
X
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. 50కి పైగా సేవలను ప్రజలకు చేరువలోనే అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల గ్రామ వార్డు సచివాలయాలు ఇంకా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పూర్తి స్థాయిలో ప్రభుత్వ భవనాల నిర్మాణం చేపట్టినా ఇప్పటివరకు కొన్ని చోట్ల మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా చాలాచోట్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది. దీంతో పలు ప్రాంతాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల కోసం తమ భవనాలను అద్దెకు ఇచ్చిన యజమానులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. నెలల తరబడి వారికి అద్దె చెల్లించకుండా విసిగిస్తోంది. దీంతో కడుపు మండిన యజమానులు వాటికి తాళాలు వేసి తమ నిరసన తెలిపారు.

తాజాగా ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో భవన యజమాని షాక్‌ ఇచ్చాడు. యర్రగొండపాలెం మండలం నరసాయపాలెంలో గ్రామ సచివాలయానికి ఏళ్ల తరబడిగా ప్రభుత్వం అద్దె చెల్లించడం లేదంటూ తాళం వేశాడు.

సచివాలయ ఉద్యోగులు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆయన వినలేదు. దీంతో ఉద్యోగులు సమీపంలోని చెట్ల కిందనే ఉండిపోయారు. సచివాలయం ఏర్పాటు చేసి ఏళ్లు గడిచినా తనకు అద్దె ఇవ్వడం లేదని.. బిల్లులు పెట్టాం.. వస్తాయని ఎప్పటికప్పుడు మాటలు చెప్పి తప్పించుకుంటున్నారని భవన యజమాని చిమటా వెంకట రాములు ఆరోపిస్తున్నాడు.

నరసాయపాలెంలో జరిగినట్టే వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం గూడెం చెరువు గ్రామంలో జరిగింది. పది నెలలుగా తమకు అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ముక్కా ముల్లారెడ్డి దానికి తాళం వేశాడు. ఇక్కడ కూడా గ్రామ సచివాలయమే నిర్వహిస్తున్నారు. అద్దె గురించి అడుగుతుంటే అధికారులు సమాధానం కూడా చెప్పడం లేదని ముల్లారెడ్డి ఆరోపిస్తున్నాడు. దీంతో తమకు కుటుంబ పోషణ కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె వసూలు చేయడం కోసం భవనానికి తాళం వేయక తప్పలేదని చెబుతున్నాడు.

కాగా ఒక్క గ్రామ సచివాలయ భవనాలు మాత్రమే కాకుండా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ వంటివి కూడా ఇప్పటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇప్పడిప్పుడే శాశ్వత భవనాల నిర్మాణం సాగుతోంది. ఇవి పూర్తయి అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ప్రభుత్వానికి ఈ కష్టాలు తప్పేట్టా లేవు.