Begin typing your search above and press return to search.

అశ్లీల నృత్యాలు అడ్డుకున్నందుకు..

By:  Tupaki Desk   |   19 Jan 2019 10:49 AM GMT
అశ్లీల నృత్యాలు అడ్డుకున్నందుకు..
X
విశాఖలో సంక్రాంతి వేడుకలు శృతిమించాయి. సంక్రాంతి వచ్చిదంటే పక్షం రోజుల పాటు గ్రామాల్లో తీర్థాలు నిర్వహిస్తుంటారు. ఈసారి ఆధునిక పోకడలకు పోయి ఘర్షణలు తలెత్తాయి. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

రానున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని రాములవారి తీర్థంలో స్థానిక సర్పంచ్ బావ అయిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు సాంస్కృతిక అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఆ నృత్యాలను అడ్డుకోబోయారు. దీంతో వేలాదిగా ఉన్న గ్రామస్థులు పోలీసులపై తిరుగుబాటు చేశారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కరణం శ్రీనివాసరావు అలియాస్ టెక్కలి శ్రీను తను అనుచరులతో కలిసి పోలీసులపై దాడి చేశారు. రూరల్ ఎస్ఐ ఆదినారాయణ రెడ్డిని కాలువలో పడేశారు. హెడ్ కానిస్టేబుల్ పై నాయకులు చేయి చేసుకున్నారు. పోలీస్ జీపును ధ్వంసం చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిల్లాస్థాయిలోనూ టీడీపీ నేత ఆగడాలు సంచలనమయ్యాయి.

ఈ ఘటనపై సీఐ రాంచంద్రరావు నేతృత్వంలో శుక్రవారం మామిడిపాలేం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.టీడీపీ నాయకుడితోపాటు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. ఎంపీపీ భర్త కొణతాల శ్రీను టీడీపీ నాయకుడి వెంట పోలీస్ స్టేషన్ వెళ్లి లాబీయింగ్ చేశారు. కాగా విచారణలో టీడీపీ నేత అస్వస్థతకు గురికావడంతో పోలీసులు అనకాపల్లి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కొట్టడం వల్లే టీడీపీ నేత అస్వస్థతకు గురయ్యారని ఆయన అనుచరులు ఆందోళన చేశారు.