Begin typing your search above and press return to search.

తెలంగాణ బొగ్గు అంటున్న వినోద్ కుమార్ మాటలు చెల్లుబాటు అవుతాయా?

By:  Tupaki Desk   |   17 Oct 2021 11:09 AM GMT
తెలంగాణ బొగ్గు అంటున్న వినోద్ కుమార్ మాటలు చెల్లుబాటు అవుతాయా?
X
ఇప్పటికున్న పంచాయితీలు సరిపోవన్నట్లుగా తెలంగాణ ప్రభుత్వానికి చుక్కలు చూపించేందుకు వీలుగా కేంద్ర నిర్ణయాలు ఉండనున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఇటీవల కాలంలో బొగ్గు కొరత భారీగా ఏర్పడటం.. తెలంగాణలోని జయశంకర్ భూపాల పల్లిలోని విద్యుత్ ఉత్పత్తి కోసం సింగరేణి బొగ్గును వినియోగించాలంటూ టీఆర్ఎస్ నేత.. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ డిమాండ్ చేస్తున్నారు.

ఎందుకిలా? అంటే.. కేంద్రం అనుసరిస్తున్న విధానమే తాజా వ్యాఖ్యలకు కారణమని చెప్పాలి. తాడిచర్ల నుంచి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు వీలుగా కేంద్రంలోని కొందరు పెద్దలు సింగరేషి అధికారుల్ని నోటి మాటగా ఆదేశించినట్లుగా ఆరోపిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని జోక్యం చేసుకున్న వినోద్ కుమార్.. ఇతర రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని చెప్పి.. సింగరేణి బొగ్గును తెలంగాణ అవసరాలకు వినియోగించకుండా.. వేరే చోటుకు ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ బొగ్గును తెలంగాణ అవసరాలకే వినియోగించాలని ఆయన కోరుతున్నారు.

దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ముంచుకు రావటం.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మీద తీవ్ర ప్రభావాన్ని చూపించటం తెలిసిందే.దీంతో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో విద్యుదుత్పత్తి ఇబ్బందికరంగా మారింది. ఇలాంటివేళ.. తెలంగాణలో మాత్రం అంత కొరత లేకపోవటం. సింగరేణి అండగా నిలవటంతో తమకు విద్యుదుత్పత్తికి ఎలాంటి ఆటంకం వాటిల్లే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటివేళ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు షాకింగ్ గా మారింది. దేశ వ్యాప్తంగా 88 బొగ్గు బ్లాకులకు వేలం వేస్తున్న కేంద్రం.. అందుకు సంబంధించిన జాబితానువిడుదల చేసింది. అందులో తెలంగాణ పేరు కనిపించటం ఇప్పుడు కొత్త రచ్చకు తెర తీసినట్లేనన్న మాట వినిపిస్తోంది. కోల్ మైన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 2015, మైన్స్ మరియు మినరల్స్ యాక్ట్ 1957 ప్రకారం బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, చతిస్గడ్, ఒడిశా, ఝార్ఖండ్ , అస్సాం, రాష్ట్రాల్లోని బ్లాక్ లతో పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బొగ్గు గనులు ఉన్నాయి.

కేంద్రం విడుదల చేసిన జాబితాలో ఉన్న సింగరేణిలోని బొగ్గుగనుల్లో అన్వేషనకు ఇప్పటివరకు ఆ సంస్థ చాలానే ఖర్చుచేసింది.ఇలాంటి వేళ.. కేంద్రం తీసుకున్న నిర్ణయం షాకింగ్ గా మారింది. బొగ్గు అన్వేషణకు సింగరేణి సంస్థ రూ.66 కోట్ల వరకు వివిధ దశల్లో ఖర్చు చేసింది. ఆ సమాచారాన్ని కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేసింది కూడా. అయినప్పటికి కేంద్రం తన జాబితాలోతెలంగాణ పేరును ఎందుకు ప్రస్తావించారన్ని ప్రశ్నగా మారింది.

ఇదిలా ఉంటే.. కేంద్రం వినిపిస్తున్న వాదన ఏమంటే.. తాజాగా కేంద్రం లీజుకు ఇస్తానని చెప్పిన బ్లాకులు సింగరేణి పరిధిలో లేవని.. అందుకే కేంద్రం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. దీంతో.. ఇప్పుడా బ్లాకుల్ని సొంతం చేసుకోవాలంటే ప్రైవేటు సంస్థలతో పోటీగా సింగరేణి పోటీ పడాల్సిన పరిస్థితి. మరోవైపు.. తెలంగాణ రాష్ట్రం సైతం కేంద్రం తీరును తీవ్రంగా తప్ప పడుతోంది. మొత్తంగా కేంద్రం షాకిచ్చిన బొగ్గు గనుల వ్యవహారం కేంద్ర.. రాష్ట్రాల మధ్య సరికొత్త లొల్లికి కారణమవుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.