Begin typing your search above and press return to search.

వ్యూహాత్మకంగానే బాబా అనుచ‌రుల హింస‌!

By:  Tupaki Desk   |   25 Aug 2017 4:05 PM GMT
వ్యూహాత్మకంగానే బాబా అనుచ‌రుల హింస‌!
X
అత్యాచారం - హత్య కేసులో వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు - డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌ ను పంచకుల సీబీఐ కోర్టు దోషిగా తేల్చిన సంగ‌తి తెలిసిందే. గుర్మీత్ కు ఈ నెల 28న శిక్ష ఖరారు కానుంది. కోర్టు తీర్పు వెలువ‌డిన అనంత‌రం గుర్మీత్ మ‌ద్ద‌తుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు గాల్లోకి కాల్పులు జరుపుతూ - భాష్పవాయువును ప్రయోగించారు. కోర్టు తీర్పుతో హరియాణా - పంజాబ్‌ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హరియాణాలో 224 ఘటనలు జరగగా - పంజాబ్‌ లో 64 ఘటనలు జరిగాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అందిన వార్త‌ల ప్ర‌కారం ఈ హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌లో 31 మంది మ‌ర‌ణించారు. వంద‌మందికి పైగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం పంజాబ్‌ - హ‌రియాణాల‌లో కొన‌సాగుతున్న ఈ హింసాత్మ‌క ఘ‌ట‌నలు తాజాగా ఢిల్లీకి కూడా పాకాయి. ఢిల్లీలోని రేవా ఎక్స్ ప్రెస్ రైలుకు - ఓ బ‌స్సుకు ఆందోళ‌న‌కారులు నిప్పు పెట్టారు. నోయిడాలో 144 సెక్ష‌న్ విధించారు. అల్ల‌రి మూక‌ల‌ను చెద‌రగొట్టేందుకు పారా మిలిట‌రీ బ‌ల‌గాలు - పోలీసులు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల‌లోని ప‌రిస్థితుల‌ను కేంద్రం ఎప్ప‌టిక‌పుడు స‌మీక్షిస్తోంది.

ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువడనుండటంతో హరియాణా - పంజాబ్ ల‌లో నిన్న‌టి నుంచి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ రెండు రాష్ట్రాల‌లో గుర్మీత్‌ మద్దతుదారులు - అభిమానులు దాదాపు లక్ష మంది వరకూ పంచకులకు చేరుకున్నారు. ఒక్క కోర్టు ప్రాంగ‌ణంలోనే దాదాపు 50 నుంచి 60 వేల మంది గుర్మీత్ మ‌ద్ద‌తుదారులు ఉన్నారు. గుర్మీత్ కు తీర్పు వ్య‌తిరేకంగా వ‌స్తే హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చెల‌రేగే అవ‌కాశమున్నందున ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్నాయి. పంజాబ్ - హరియాణాల్లోని సున్నితమైన ప్రాంతాల్లో పోలీసులతోపాటు మ‌రో 15 వేలమంది పారామిలిటరీ బలగాలను శుక్ర‌వారం ఉదయ‌మే మోహరించారు. పంజాబ్‌ లో 75 కంపెనీల కేంద్ర బలగాలు - హరియాణాలో 35 కంపెనీల కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పాఠశాలలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.అక్క‌డ అన్ని జిల్లాల్లోనూ 144 సెక్షన్‌ విధించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ హైఅలర్ట్‌ ప్రకటించారు. ఇరు రాష్ట్రాల్లోనూ 72 గంటల పాటు మొబైల్‌ - ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. పంచకులకు వెళ్లే బస్సులు - రైళ్లపై ఆంక్షలు విధించారు.

అయితే, ఈ కేసు తీర్పు నేప‌థ్యంలో ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకున్న‌ప్ప‌టికీ హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు జ‌ర‌గడం ప‌లువురిని విస్మ‌యానికి గురి చేస్తోంది. మొబైల్‌ - ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను 3 రోజుల పాటు నిలిపి వేసిన‌ప్ప‌టికీ గుర్మీత్ అనుచ‌రుల‌కు తీర్పుకు సంబంధించిన స‌మాచారం అందుతూనే ఉంది. ఒక వేళ బాబా అనుచ‌రుల‌కు, మ‌ద్ద‌తుదారుల‌కు ఇంట‌ర్నెట్‌, మొబైల్ సేవ‌లు అంది ఉంటే ప‌రిస్థితి అదుపులో ఉండేది కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ప్ప‌టికీ బాబా అనుచ‌రులు కోర్టు ప్రాంగ‌ణంలోనే పోలీసుల‌పై రాళ్లు రువ్వారు. ఇంత ప‌క‌డ్బందీ భ‌ద్ర‌త ఉన్న‌ప్ప‌టికీ ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయి ప్ర‌భుత్వ ఆస్తులను ధ్వంసం చేయ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒక వేళ ఇరు ప్ర‌భుత్వాలు భ‌ద్ర‌త విష‌యంలో ఏ మాత్రం ఉదాసీనంగా ఉన్నా మ‌రింత మంది మ‌ర‌ణించి ఉండేవార‌ని ప‌లువురు అభిప్రాయప‌డుతున్నారు. తీర్పును ముందే ఊహించిన గుర్మీత్ అనుచ‌రులు ఆయ‌న ప్ర‌ధాన ఆశ్ర‌మంలో భారీ ఎత్తున పెట్రోల్‌ - డీజిల్ క్యాన్ల‌ను నిల్వ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో, వారు భారీ విధ్వంసానికి ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కారం కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు భావిస్తున్నారు. పంజాబ్‌, హ‌రియాణాల‌తో పాటు ఢిల్లీలో గుర్మీత్ కు భారీ ఎత్తున అభిమానులుండ‌డంతో హింసాత్మ‌క ఘ‌ట‌నలు మ‌రింత పెరిగే అవ‌కాశముంద‌ని పోలీసులు భావిస్తున్నారు. ఆ మూడు ప్రాంతాల‌లో మ‌రిన్ని బ‌ల‌గాల‌ను మోహరించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.