Begin typing your search above and press return to search.

'భార‌త్ బంద్' హింసాత్మకం...ముగ్గురి మృతి!

By:  Tupaki Desk   |   2 April 2018 11:59 AM GMT
భార‌త్ బంద్ హింసాత్మకం...ముగ్గురి మృతి!
X
ఎస్సీ - ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కొంద‌రు దుర్వినియోగం చేస్తున్నార‌ని - ఆ చ‌ట్టాన్ని సవరిస్తూ తక్షణ అరెస్టులను నిషేధించాలని కొద్ది రోజుల క్రితం సుప్రీం తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో, ఆ తీర్పుకు వ్య‌తిరేకంగా సోమ‌వారం నాడు దేశవ్యాప్త బంద్ కు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేప‌థ్యంలో నేడు జ‌రుగుతున్న‌ బంద్ లో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో తీవ్ర‌స్థాయిలో ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. మధ్యప్రదేశ్ - రాజస్థాన్ - ఉత్తరప్రదేశ్ - పంజాబ్ - బీహార్ - ఒడిశా లలోని ప‌లు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జ‌రిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు భార‌త్ బంద్ కారణంగా జ‌రిగిన ఆందోళ‌న‌ల్లో దేశవ్యాప్తంగా ముగ్గురు వ్యక్తులు మ‌ర‌ణించ‌గా - ప‌లువురు గాయ‌ప‌డ్డారు. మ‌రోవైపు, ఈ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో సోమ‌వారం నాడు.....ఈ తీర్పుపై సమీక్షకు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

పంజాబ్ లోని జలంధర్ - రోపర్ - బతిందా - ఫిరోజ్ పూర్ - అమృత్ సర్ ప్రాంతాల్లో దళిత సంఘాలు నిర్వ‌హించిన ఆందోళనలు హింసాత్మ‌క‌మయ్యాయి. బిహార్ లోని పాట్నాలో దళిత సంఘాల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కార్లను కర్రలతో ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. బీహార్ లోని ఫోర్బ్స్ గంజ్ రైల్వే జంక్షన్ లోనూ నిరసనకారులు ఆందోళన చేశారు. ఒడిశా సంబల్ పూర్ లోనూ రైలు పట్టాలపై నిర‌స‌న‌కారులు ఆందోళన చేశారు. మ‌ధ్య ప్ర‌దేశ్ లోనూ ఆందోళ‌న‌లు మిన్నంటాయి. దీంతో, ఆదివారం సాయంత్రం 5గం. నుంచి సోమవారం రాత్రి 11గం. వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. స్కూల్స్ మూతప‌డ‌గా - రవాణా వ్యవస్థకు తీవ్ర అంత‌రాయం క‌లిగింది. న్యూఢిల్లీలోని మండి హౌజ్ లో దళిత సంఘాలు రోడ్ల పైకి రావ‌డంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో పరిస్థితులు అదుపు తప్పడంతో ఇద్దరు మరణించగా - ప‌లువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో - ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. బీజేపీ దళితుల అభివృద్దికి కట్టుబడి ఉందని, ప్రజలంతా శాంతంగా ఉండాలని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్ట‌ర్ ద్వారా కోరారు.శాంతి భద్రతలకు ఎవరూ భంగం కలిగించవద్దని - దళితుల సంక్షేమానికి బీజేపీ చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. త‌మ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ‌ దృష్టికి తీసుకురావాలని యోగి అన్నారు. అయితే, త‌మ ఆందోళ‌న‌ల వ‌ల్లే ఈ తీర్పుపై సమీక్షకు కేంద్రం రివ్యూ పిటిషన్ దాఖలు చేసింద‌ని - బంద్ చేయ‌కుంటే ఈ విషయాన్ని అసలు పట్టించుకునేదే కాదని ఆందోళ‌న‌కారులు అంటున్నారు.