Begin typing your search above and press return to search.

ఉన్నట్లుండి పంజాబ్ కు ఏమైంది?

By:  Tupaki Desk   |   14 Oct 2015 9:11 AM GMT
ఉన్నట్లుండి పంజాబ్ కు ఏమైంది?
X
దశాబ్దాల తరబడి రగిలిపోయిన పంజాబ్ లో కొన్నేళ్లుగా ప్రశాంతత నెలకొంది. అలాంటి పంజాబ్ లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఈ మధ్యన ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనతో పంజాబ్ మళ్లీ ఉద్రిక్త కౌగిలిలో చిక్కున్నట్లైంది. రెండు వర్గాల మధ్య మొదలై ఘర్షణలు తీవ్ర రూపం దాల్చటం ఇప్పుడు అందోళన కలిగిస్తోంది. పంజాబ్ లో పరిస్థితుల్ని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విపరీతంగా శ్రమిస్తున్నారు.

పంజాబ్ లోని పరిద్ కోట్ పరిధిలో కొందరు వ్యక్తులు తమ దైవాన్ని దూషించారంటూ ర్యాలీ నిర్వహించటం.. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లాయి. దీంతో.. శాంతియుత పరిస్థితులు నెలకొల్పేందుకు పోలీసులు భారీగా చేరుకున్నప్పటికీ.. పరిస్థితి అదుపులోకి రావటం లేదంటున్నారు.

ఈ దాడుల కారణంగా ఇప్పటివరకూ 17 మంది వరకు గాయపడినట్లు చెబుతున్నారు. వీరిలో పోలీసులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు భారీగా పోలీసు బలగాలు రంగంలోకి దిగి.. శాంతియుత పరిస్థితులు తీసుకొచ్చినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నా.. పరిస్థితి మాత్రం టెన్షన్ గా ఉందన్న వాదన వినిపిస్తోంది. పంజాబ్ ప్రజలంతా సంయమనంతో వ్యవహరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కోరుతున్నారు. మరి.. పంజాబీయులు ఎంత ప్రశాంతంగా ఉంటారన్నది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం.