Begin typing your search above and press return to search.

తమిళనాడు అసెంబ్లీలో రచ్చ.. రచ్చ

By:  Tupaki Desk   |   18 Feb 2017 7:23 AM GMT
తమిళనాడు అసెంబ్లీలో రచ్చ.. రచ్చ
X
తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో విశ్వాస పరీక్ష కాస్తా అసెంబ్లీలో రణరంగాన్ని తలపించేలా చేసింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో మొదలైన సమావేశాలు.. అంతకంతకూ ముదిరి.. ఎవరూ కలలో కూడా కనని పరిస్థితుల్లోకి సభలో వ్యవహారాలు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

అధికార అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వచ్చి.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళ వర్గీయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదిహేను రోజుల వ్యవధిలో బలాన్నినిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. దీనికి తగినట్లే శనివారమే తన బలాన్ని నిరూపించుకుంటానన్న పళనిస్వామి మాటతో.. అసెంబ్లీని ప్రత్యేకంగ హాజరుపరిచారు.

బలనిరూపణ కోసం సభ సజావుగా జరగాల్సిన స్థానే.. స్పీకర్ వ్యవహరించిన తీరుతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్న మాట వినిపిస్తోంది. మొదట సభ్యులందరి చేత మాట్లాడించిన తర్వాత.. ఓటింగ్ జరగాల్సి ఉన్నా.. అలాంటిదేమీ లేకుండా ఏకంగా ఎన్నికకు వెళ్లటంపై విపక్ష డీఎంకే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని విపక్ష నేత స్టాలిన్.. పన్నీర్ సెల్వం పట్టుబట్టినా.. డివిజన్ల వారీగా ఎన్నిక నిర్వహించేందుకే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం సభకు 230 మంది సభ్యులు హాజరయ్యారు. వీరిని ఆరు డివిజన్లుగా విభజించి ఎన్నిక ప్రక్రియను చేపట్టారు.

దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా.. స్పీకర్ పట్టించుకోకుండా ఓటింగ్ ప్రక్రియను కొనసాగించటంతో సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. మొదటి డివిజన్ ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యేసరికి.. మొత్తం పరిస్థితి చేజారి పోయింది. మొదటి డివిజన్ లెక్కింపు పూర్తి అయ్యేసరికి పళనిస్వామికి 38ఓట్లు అధిక్యత లభించింది. రెండో డివిజన్ ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ.. విపక్ష నేతల్లో ఆందోళన అంతకంతకూ పెరిగిపోయి తీవ్రస్థాయికి చేరుకుంది.

స్సీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరించటం మొదలుపెట్టారు. ప్రతిపక్ష డీఎంకేనేతల ధాటికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. టేబుళ్లను ధ్వంసం చేసి.. మైకులు విరగొట్టేశారు. ఇలాంటి గందరగోళం ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో లైవ్ ప్రసారాల్ని నిలిపి వేయటంతో పాటు.. మీడియా ప్రతినిధులు కూర్చున్న చోట ఆడియోను కట్ చేసినట్లుగా చెబుతున్నారు. సభలో చోటుచేసుకున్న ప్రత్యేక పరిస్థితులతో అసెంబ్లీ తలుపుల్ని మూసివేశారు.

మరోవైపు.. తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న స్పీకర్ వైఖరితో కట్టలు తెగిన ఆగ్రహాన్ని ప్రదర్శించారు డీఎంకే ఎమ్మెల్యేలు. స్పీకర్ ముందున్న పోడియంను ధ్వంసం చేయటంతో పాటు.. ఆయన కుర్చీని కూడా కదిలించి వేసినట్లుగా కొన్ని మీడియా సంస్థలు చెబుతున్నాయి. దీంతో.. సభను అరగంట సేపు వాయిదా వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వాయిదా మాటతో మరింతగా చెలరేగిపోయిన విపక్ష సభ్యులు.. స్పీకర్ పోడియం వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. స్పందించిన మార్షల్స్ స్పీకర్ కు రక్షగా నిలిచి.. ఆయన్ను చుట్టు రక్షణ కవచంలా వ్యవహరించి.. అతి కష్టమ్మీదా ఆయన ఛాంబర్ లోకి తీసుకొచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ సమయంలో స్పీకర్ కుర్చీని కింద పడేసినట్లుగా కొందరు చెబుతున్నారు. స్పీకర్ కుర్చీలో డీఎంకే సభ్యులు కె.కె. సెల్వం కూర్చోవటం లాంటి అసాధారణ సంఘటనలుచోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఊహించని రీతిలో సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మొదట అరగంట అనుకున్న వాయిదాను ఒంటి గంట వరకూ పొగిడించారు. మరికాసేపటి వరకూ వాయిదా కొనసాగుతుందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/