Begin typing your search above and press return to search.

రెండు కుక్కలకు మరణ శిక్ష..!

By:  Tupaki Desk   |   13 July 2021 10:12 AM GMT
రెండు కుక్కలకు మరణ శిక్ష..!
X
అదేంటీ.. కుక్క‌ల‌కు మ‌ర‌ణ శిక్ష విధించ‌డ‌మేంటీ అని అనుకుంటున్నారా? నిజంగానే కుక్క‌ల‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించారు. పాకిస్థాన్ లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దీనికి కార‌ణ‌మేంటీ? అన్న‌ది చూద్దాం.

గ‌త నెల‌లో.. పాక్ లోని క‌రాచీ న‌గ‌రంలో మీర్జా అక్త‌ర్ అనే వ్య‌క్తి ఒక రోజు మార్నింగ్ వాక్ కు బ‌య‌లు దేరాడు. అయితే.. జ‌ర్మ‌న్ షెఫ‌ర్డ్ జాతికి చెందిన రెండు కుక్క‌లు ఆయ‌న మీద ప‌డి దారుణంగా క‌రిచాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ విష‌యం స‌మీపంలోని సీసీ టీవీ కెమెరాల్లోనూ రికార్డ్ అయ్యింది.

అయితే.. బాధితుడు ఎవ‌రో కాదు సీనియ‌ర్ లాయ‌ర్‌. ఆయ‌న వెంట‌నే ఈ విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇలా మ‌నుషుల‌ను క‌రిచే కుక్క‌ల‌ను ఇళ్ల మ‌ధ్య ఉంచినందుకు య‌జ‌మానిని ప్ర‌తివాదిగా చేరుస్తూ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు. దీంతో.. ఇబ్బంది ఎదుర‌వుతుందేమోన‌ని భావించి, కోర్టు బ‌య‌ట సెటిల్ మెంట్ చేసుకుందామ‌ని కోరాడు య‌జ‌మాని.

ఇద్ద‌రూ క‌లిసి బ‌య‌ట ఒక ఒప్పందానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా బాధితుడు ప‌లు కండీష‌న్లు పెట్టాడు. దానికి కుక్క‌ల‌ య‌జ‌మాని అంగీక‌రించాడు. ఈ ఒప్పందం ప్ర‌కారం.. ఆ కుక్క‌ల‌ను ఎవ‌రైనా వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్లి పాయిజ‌న్ ఇంజెక్ష‌న్ ఇచ్చి చంపేయాలి. ఈ ఘ‌ట‌న‌పై క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. ఇక‌, భ‌విష్య‌త్ లో ఎన్న‌డూ ఇలాంటి ప్ర‌మాద‌క‌ర‌మైన కుక్క‌ల‌ను పెంచ‌కూడ‌దు అని లాయ‌ర్ ష‌ర‌తులు విదించాడు.

దీనికి స‌ద‌రు కుక్క‌ల య‌జ‌మాని అంగీక‌రించాడు. అనంత‌రం ఈ ఒప్పందంపై ఇద్ద‌రూ సంత‌కాలు చేసి, కోర్టుకు స‌మ‌ర్పించారు. కాగా.. దీనిపై జంతు ప్రేమికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కుక్క‌ల‌ను చంపేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు.