Begin typing your search above and press return to search.

హింసావాది గొల్ల బాబురావు అహింసావాదిగా మారిపోయారట

By:  Tupaki Desk   |   21 April 2022 3:28 AM GMT
హింసావాది గొల్ల బాబురావు అహింసావాదిగా మారిపోయారట
X
నేను మంచోడ్ని. సౌమ్యుడ్ని. ప్రజల కోసం ఆలోచిస్తాను. వారి కోసం విపరీతంగా కష్టపడతాను. వారే లోకం. వారే సర్వస్వం అంటూ మాటలు చెప్పే రాజకీయ నేతలకు కొదవ ఉండదు. అందుకు భిన్నంగా "నేను మంచోడ్ని కాదు. హింసావాదిని" అంటూ మీడియా ముందు.. అది కెమేరాల సాక్షిగా వీరంగం వేశారు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లు ఆయన మాటలు ఉన్నాయన్న మాట వినిపించింది. అయినప్పటికీ చాలామందికి ఆశ్చర్యానికి గురి చేశారు గొల్ల.

జగన్ లాంటి అధినేత నిర్ణయానికి భిన్నంగా.. ఆయనకు మంట పుట్టేలా మాట్లాడే ధైర్యం చేసిన బాబురావును ఆరాధనగా చూసినోళ్లు లేకపోలేదు. ఇప్పుడున్న వాట్సాప్.. సోషల్ మీడియా కాలంలో నేను మెతకవాడ్ని కాదు.. హింసావాదిని.. దెబ్బకు దెబ్బ తీస్తా.. లాంటి మాటలతో పాటు.. విన్నంతనే ఉలిక్కిపడే మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి.

ఉన్నట్లుండి ఇంతలా ఆయన చెలరేగిపోవటానికి కారణం.. మంత్రివర్గంలో చోటు దక్కుతుందనుకుంటే అందుకు భిన్నంగా పరిస్థితులు ఉండటమే. ఆవేశంతో ఉన్నప్పుడు ఆలోచన తగ్గుతుంది. గొల్ల బాబురావు విషయంలోనూ చోటు చేసుకుంది.

కడుపులో ఉన్న బాధ.. మనసులో ఉన్న వేదనను మీడియా ముందుకు వచ్చి కక్కేసిన తర్వాత ఆయన శాంతపడ్డారు. ఆ తర్వాతే ఆయనకు అర్థమైంది తానేం అన్నది. ఏమనుకున్నారేమో కాదు.. ముందురోజు నిప్పులు కురిపించిన ఆయన మాటలకు భిన్నంగా తర్వాతి రోజు ఆయన మాట తీరు మొత్తం మారిపోయింది. వైరల్ అవుతున్న తన మాటలు ఎవరో పుట్టించనవే తప్పించి.. తాను మాట్లాడలేదంటూ రాజకీయ నేతలకు అలవాటైన మాటల్ని చెప్పుకొచ్చారు.

తాను ఎప్పటికి సౌమ్యవాదినేనని.. అసలు హింసావాదిని ఎందుకవుతానంటూ ప్రశ్నిస్తూ.. మంత్రి పదవి రాకున్నా పార్టీకి పూర్తిగా విధేయుడ్నేనని.. ముఖ్యమంత్రి జగన్ కు ఆరాధకుడినేనని పేర్కొన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమన్న ఆయన.. జగన్ ది గ్రేట్ అంటూ కితాబును ఇచ్చేశారు.

మండే ఎండకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మండిపడ్డ బాబురావు.. మధ్యాహ్నం తర్వాత వచ్చే సాయంత్రం మాదిరి పక్కరోజుకు మారిపోయారు. ఏమైనా.. స్వయంప్రకటిత హింసావాది.. రోజులో అహింసావాదిగా మారిపోవటం ప్రస్తుతానికి బాగానే ఉన్నా.. భవిష్యత్తులో మాత్రం ఈ మాటలు ఆయన్ను ఏదో రూపంలో వెంటాడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.